Nani’s The Paradise Pre Sales: ‘నేచురల్ స్టార్’ నాని హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’. ఈ మూవీ సెప్టెంబరు 24న విడుదల కానుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘దసరా’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత నాని, శ్రీకాంత్ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో సినిమాపై భారీ హైప్ నెలకొంది. ఈ నేపథ్యంలోనే ది ప్యారడైజ్ మూవీ విడుదలకు ముందే రికార్డులు కొల్లగొడుతోంది.
ది ప్యారడైజ్ సినిమాకు ఓవర్సీస్ మార్కెట్‌లో ఊహించని మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోలకు ప్రీ-సేల్స్ జోరుగా సాగుతున్నాయి. బుకింగ్స్ ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రీ-సేల్స్ $100K మార్క్‌ను (లక్ష డాలర్ల మార్కు) దాటగా.. తాజాగా ఈ మొత్తం $150Kకు (లక్ష 50 వేల డాలర్ల మార్కు) చేరువలో ఉంది. ఇప్పటివరకు 5,000కు పైగా టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం. విడుదలకు ఇంకా రెండు వారాల సమయం ఉండగానే ఈ స్థాయిలో టికెట్లు అమ్ముడవడం ట్రేడ్ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. రాబోయే రోజుల్లో ప్రీ-సేల్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఓవర్సీస్‌లో ఒకరోజు ముందుగానే.. అంటే సెప్టెంబరు 23న రిలీజ్ కానుంది.
నార్త్ అమెరికాలో ఇప్పటికే అత్యంత వేగంగా లక్ష డాలర్లు వసూళ్లు చేసిన తెలుగు చిత్రంగా ది ప్యారడైజ్ నిలిచింది. ఇప్పుడు మరో మార్క్ కూడా అందుకొని.. యూఎస్ మార్కెట్‌లో సంచలన ఓపెనింగ్స్‌పై కన్నేసింది. ఈ చిత్రంలో కాయదు లోహర్ కథానాయికగా నటిస్తుండగా.. సీనియర్ నటుడు మోహన్ బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. దీంతో సినిమా ప్రమోషన్స్‌పై చిత్రబృందం మరింత దృష్టి పెట్టింది.

