Site icon NTV Telugu

ఈ వీకెండ్ లో అత్యధిక చిత్రాల విడుదల!

కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిన తర్వాత కూడా జనాలు థియేటర్లకు రావడం పెద్దంతగా జరగడం లేదు. అయితే ఆంధ్రప్రదేశ్ లో నాలుగు ఆటలతో పాటు నూరు శాతం ఆక్యుపెన్సీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో సినిమాల విడుదల సంఖ్య పెరిగింది. గతవారం ఐదు సినిమాలు థియేట్రికల్ రిలీజ్ కాగా, ఈ వారం ఏకంగా తొమ్మిది చిత్రాలు థియేటర్లకు క్యూ కట్టడం విశేషం.

అందులో ప్రధానంగా చెప్పుకోదగ్గవి రెండే సినిమాలు. ఒకటి నాగశౌర్య హీరోగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ‘వరుడు కావలెను’ చిత్రం. లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో రీతువర్మ నాయిక. ఇక పూరి జగన్నాథ్ కొడుకు ఆకాశ్ హీరోగా నటిస్తున్న ‘రొమాంటిక్’ రెండో సినిమా. ఈ సినిమాతో అనిల్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా కేతికా శర్మ హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా విడుదలకు ముందే కేతికా శర్మకు మరికొన్ని అవకాశాలు వచ్చాయి. అందులో నాగశౌర్య ‘లక్ష్య’ కూడా ఉంది.

ఇదిలా ఉంటే… ఈ వారం ఈ రెండు సినిమాలతో పాటు నవీన్ చంద్ర నటించిన ‘మిషన్ 2020’; ‘హుషారు’ ఫేమ్ అభినవ్ మేడిశెట్టి, రమ్య పసుపులేటి జంటగా నటించిన ‘మైల్స్ ఆఫ్ లవ్’ చిత్రాలూ విడుదల అవుతున్నాయి. అలానే క్రిష్ బండిపల్లి హీరోగా నటించి, నిర్మించిన ‘రావణ లంక’ చిత్రం; ‘ఓ మధు’ సినిమాలతో పాటు తమిళ అనువాదం ‘మిస్టర్ ప్రేమికుడు’, కన్నడ అనువాద చిత్రం ‘జై భజరంగి’ కూడా థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. మొత్తం మీద ఈ మధ్య కాలంలో ఒకే వారం ఏకంగా 9 సినిమాలు విడుదల కావడం ఇప్పుడే జరుగుతోంది!

Exit mobile version