చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా గత సంవత్సరం థియేటర్లు మూతపడ్డాయి. మిగతా అన్ని రంగాలు డోర్స్ క్లోజ్ చేసినా బాక్సాఫీస్ మూతపడేది కాదు. సినిమా ఆవిష్కరణ జరిగినప్పట్నుంచీ శతాబ్దాల తరబడి ఇదే సాగింది. కానీ, కరోనా లాంటి కంటికి కనిపించని విలన్ పైకి దూకటంతో జేమ్స్ బాండ్ లాంటి హీరోలు మొదలు మన అగ్ర కథానాయకుల దాకా అందరూ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అయితే, 2020లోని పీడకలే పెద్ద తెరకి 2021లోనూ మళ్లీ ఎదురైంది. ఈసారి కూడా రోజుల తరబడి దేశ వ్యాప్తంగా బాక్సాఫీస్ మూసేశారు. కానీ, వెస్ట్రన్ కంట్రీస్ లో పరిస్థితి భిన్నంగా ఉంది. అమెరికా, యూరప్ లో సినిమాలు వరుసగా రిలీజైపోతున్నాయి. అలా జూన్ 4న జనం ముందుకు వచ్చిందే ‘ద కాన్ జ్యూరింగ్ : ద డెవిల్ మేడ్ మీ డూ ఇట్’ సినిమా.
హారర్ థ్రిల్లర్ అయిన ‘ద కాన్ జ్యూరింగ్’ మంచి రివ్యూస్ తో పలు దేశాల్లో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అయితే, మన దేశంలో ఇంకా థియేటర్లు లేకపోవటంతో జూలైలో ఆడియన్స్ ముందుకు రానుంది. వచ్చే నెల రెండున ‘ద కాన్ జ్యూరింగ్’ పెద్ద తెరపై విడుదల చేయాలని వార్నర్ బ్రదర్స్ సంస్థ ఆలోచిస్తోందట. ఇప్పటికింకా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు థియేటర్లు తెరవటం పై ఎలాంటి ప్రకటనా చేయనప్పటికీ జూలైకల్లా అన్ని చోట్లా బాక్సాపీస్ తెరుచుకుంటుందని ట్రేడ్ ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ముంబై పరిస్థితిపై హాలీవుడ్ చిత్రాల నిర్మాతలు దృష్టి పెడుతున్నారట. ఇండియన్ సినిమా క్యాపిటల్ గా భావించే అక్కడ థియేటర్లు తెరుచుకుంటే అడుగు ముందుకు వేయాలని ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో థియేటర్ల రీ ఓపెనింగ్ తరువాత తొలి భారీ చిత్రం ‘ద కాన్ జ్యూరింగే’ అవ్వొచ్చు. జూలై 27న తమ సినిమా రాబోతోందని ఇప్పటికే అక్షయ్ కుమార్ ‘బెల్ బాటమ్’ గురించి అధికారిక ప్రకటన చేశాడు. కాబట్టి వచ్చే సెకండ్ హాఫ్ లో మన సినిమాలు ఎక్కువగా టికెట్ కౌంటర్ వద్దకి రావచ్చు. అంతలోపే బిగ్ స్క్రీన్ రీఓపెనింగ్ తరువాత వెనువెంటనే హాలీవుడ్ సినిమాలు డబ్బింగ్ వర్షన్స్ తో వచ్చేస్తాయి…
