CM Vijay: తమిళనాడు రాజకీయ చరిత్రలో నేడు ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. తమిళ సూపర్ స్టార్ ‘దళపతి’ విజయ్ మే 10వ తేదీన తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో అత్యంత వైభవంగా జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విజయ్ తన కుటుంబ సభ్యులతో పాటు, తన పార్టీ TVK (తమిళగ వెట్రి కళగం) నాయకులతో కలిసి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కూడా వచ్చి విజయ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
డ్యాషింగ్ లుక్‌లో సీఎం
ఎప్పుడూ సింపుల్‌గా కనిపించే విజయ్, తన ప్రమాణ స్వీకార వేడుక కోసం సంప్రదాయ దుస్తులకు భిన్నంగా ఫార్మల్ బ్లాక్ సూట్ – ప్యాంట్ ఎంచుకున్నారు. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో ఆయన ఎంతో హుందాగా కనిపించారు. వెండితెరపై దళపతిగా అలరించిన విజయ్, ఇప్పుడు నిజ జీవితంలో ప్రజా నాయకుడిగా తన కొత్త ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేయడంపై ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వేడుకలో నటి త్రిష కృష్ణన్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. తన తల్లి ఉమా కృష్ణన్‌తో కలిసి హాజరైన త్రిష.. చీర కట్టుకుని, తలలో మల్లెపూలు పెట్టుకుని సంప్రదాయబద్ధంగా కనిపించారు. విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తుంటే ఆమె ఎంతో ఉత్సాహంగా కనిపించారు. కార్యక్రమం అనంతరం విజయ్ వారిని కలిసి ముచ్చటించారు.
బాలనటుడి నుంచి బ్లాక్ బస్టర్ స్టార్ వరకు..
విజయ్ సినీ ప్రస్థానం తన తండ్రి ఎస్.ఏ.చంద్రశేఖర్ దర్శకత్వంలో బాలనటుడిగా స్టార్ట్ అయ్యింది. 1992లో హీరోగా ఎంట్రీ ఇచ్చినా దళపతి, 1994లో వచ్చిన ‘రసిగన్’ సినిమాతో తొలి హిట్ అందుకుని ‘ఇళయ దళపతి’గా అభిమానుల్లో గుర్తింపు పొందారు. 2003 తర్వాత వరుస విజయాలతో కోలీవుడ్ టాప్ స్టార్‌గా ఎదిగారు. 2017లో ‘మెర్సల్’ సినిమాతో ‘దళపతి’గా మారిన విజయ్, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి దిగ్గజాలకు దీటుగా తన మార్కెట్‌ను విస్తరించుకున్నారు.
‘జన నాయగన్’ కోసం ఎదురుచూపులు..
సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో విజయ్ నటించిన లాస్ట్ మూవీగా ప్రచారంలో ఉన్న ‘జన నాయగన్’ రిలీజ్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజూ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం గత ఐదు నెలలుగా రిలీజ్ కాకుండా ఆగిపోయింది. నిజానికి ఈ మూవీ జనవరి 9న రిలీజ్ కావాల్సి ఉన్నా, కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. అయితే తమిళనాడులో సీఎంగా విజయ్ పగ్గాలు చేపట్టిన నేపథ్యంలో, ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ సినిమా కోసం విజయ్ ఫ్యాన్స్‌తో పాటు సినిమా లవర్స్ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
