Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!

Tfi Production President Krishna

Tfi Production President Krishna

Krishna: తెలుగు సినీ కార్మిక సమాఖ్య (టీఎఫ్‌ఐ ఎంప్లాయీస్ ఫెడరేషన్)లో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్‌పై కొందరు వ్యక్తులు పనిగట్టుకుని చేస్తున్న అసత్య ప్రచారాలను, యూట్యూబ్ వేదికగా సాగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ యూనియన్ నేతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు ఫిలిం ప్రొడక్షన్ యూనియన్ అధ్యక్షుడు కృష్ణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా డ్యాన్సర్స్ యూనియన్ ప్రెసిడెంట్ సుమలతా దేవి వైఖరిని, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలను ఆయన తీవ్రంగా ఎండగట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “వందేళ్ల ఘన చరిత్ర కలిగిన తెలుగు సినీ పరిశ్రమలో ఎందరో కళాకారులు, కార్మికులు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి జీవిస్తున్నారు. ఇక్కడ ఆంధ్రా లేదు.. తెలంగాణ లేదు. అందరం కడుపు చేతపట్టుకుని బతకడానికి వచ్చినవాళ్లమే. కానీ కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం యూట్యూబ్ ఛానెళ్లలో ఆంధ్రా, తెలంగాణ అంటూ ప్రాంతీయ విద్వేషాలు నూరుపోస్తూ వ్యవస్థను రెండుగా చీల్చాలని చూస్తున్నారు. ఇలాంటి కుటిల ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు” అని కృష్ణ హెచ్చరించారు. శబ్దానికి కులం, ప్రాంతం ఉండవని గద్దర్ చెప్పిన మాటలను గుర్తుచేస్తూ, కార్మికుల మధ్య చిచ్చుపెట్టి చలికాచుకోవాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని స్పష్టం చేశారు.

డ్యాన్సర్స్ యూనియన్ అంతర్గత వ్యవహారాలను, అక్కడ జరుగుతున్న పరిణామాలను ప్రస్తావిస్తూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. “గతంలో స్థానిక డ్యాన్సర్లను కాదని ఇతర ప్రాంతాల్లో షూటింగ్స్ చేసిన వివాదంలో జానీ మాస్టర్‌‌ను అరెస్ట్ చేసినప్పుడు ఆయన వెనుక నిలబడి అండగా నిలిచింది ఈ సినీ పరిశ్రమ కాదా? ఆ రోజు మీకు అండగా ఉన్న వ్యవస్థను ఈరోజు ఎలా విమర్శిస్తారు?” అంటూ నిలదీశారు. డ్యాన్సర్స్ యూనియన్ అధ్యక్షురాలిగా ఉన్న సుమలతా దేవి వచ్చినప్పటి నుంచే సమస్యలు తలెత్తుతున్నాయని, మొత్తం వ్యవస్థ తన గుప్పిట్లోనే ఉండాలనే నియంతృత్వ ధోరణి వీడాలని హితవు పలికారు. ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్‌లో ఏకగ్రీవంగా వైస్ ప్రెసిడెంట్‌‌గా ఎన్నికైన వల్లభనేని అనిల్ కుమార్‌పై వ్యక్తిగత కక్షతో ఆరోపణలు చేయడం సరికాదని కృష్ణ స్పష్టం చేశారు. చిత్రపురి కాలనీలో గత నాయకులు చేసిన తప్పులను సైతం ప్రస్తుత నాయకత్వంపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంతో మాట్లాడి కార్మికుల పిల్లల కోసం మూడెకరాల స్థలంలో స్కూల్ నిర్మాణం, గతంలో 30 శాతం వేతనాల పెంపు వంటి ఎన్నో ప్రయోజనాలను ఫెడరేషన్ సాధించిందని గుర్తుచేశారు. ఆధారాలు లేకుండా వ్యక్తిగత దూషణలకు దిగితే తాము కూడా తీవ్రంగా తిరగబడాల్సి వస్తుందని, ఫెడరేషన్ నాయకత్వం జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఘాటుగా హెచ్చరించారు.