NTV Telugu Site icon

Tathvam: ఆసక్తి రేపుతున్న ‘తత్వం’ ఫస్ట్‌లుక్‌

Tathvam

Tathvam

తెలుగు ప్రేక్షకులు విభిన్నమైన కథలను, సరికొత్త ఆలోచనలను ఆదరిస్తారు. సినిమా చూసే సమయంలో వారిని నిరంతరం ఆకర్షించగలిగితే, ఆ చిత్రం ఎంత చిన్నదైనా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది. ముఖ్యంగా మర్డర్ మిస్టరీ జానర్‌లోని ఉత్కంఠ, స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇప్పుడు అలాంటి వైవిధ్యమైన కథాంశంతో, థ్రిల్లింగ్ అనుభవాన్ని అందించేందుకు సిద్ధమవుతున్న చిత్రం ‘తత్వం’. దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ సినిమాకు అర్జున్‌ కోల దర్శకత్వం వహిస్తున్నారు. త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌ సంస్థల సమష్టి నిర్మాణంలో వంశీ సీమకుర్తి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సోమవారం నాడు ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు మారుతి, కల్ట్‌ సినిమాల నిర్మాత ఎస్‌కేఎన్‌ తమ సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేసి, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

దర్శకుడు అర్జున్‌ కోల మాట్లాడుతూ, “మా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసిన మారుతి గారికి, ఎస్‌కేఎన్‌ గారికి మా కృతజ్ఞతలు. పెళ్లి సంబంధం కోసం ఓ గ్రామానికి వెళ్లిన హీరో, అక్కడ జరిగిన హత్యల కేసులో ఎలా చిక్కుకున్నాడు? ఆ పరిస్థితుల నుంచి ఎలా బయటపడ్డాడు? ఈ సంఘటనల మధ్య అతను గ్రహించిన తత్వం ఏమిటి? అనేదే ఈ సినిమా కథాంశం. ప్రతి సన్నివేశం ఉత్కంఠతో, ఆసక్తితో నిండి ఉంటుంది” అని తెలిపారు. నిర్మాత వంశీ సీమకుర్తి మాట్లాడుతూ, “ఈ తరం ప్రేక్షకులు కోరుకునే అంశాలతో పాటు, సినిమా చూస్తున్నంత సేపు ఉత్కంఠను కలిగించే అనుభవం ఈ చిత్రంలో ఉంటుంది. స్క్రీన్‌ప్లే ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. మా పోస్టర్‌ను ఆవిష్కరించిన మారుతి గారికి, ఎస్‌కేఎన్‌ గారికి మా ధన్యవాదాలు. కొత్తదనాన్ని ఆశించే ప్రేక్షకులకు మా చిత్రం ఖచ్చితంగా నచ్చుతుంది” అని అన్నారు.