కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితులకు ఓటిటి ప్లాట్ ఫామ్ లు క్యాష్ చేసుకుంటున్నాయి. చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు ఇందులో రిలీజ్ అవుతున్నాయి. అమెజాన్, నెట్ ఫ్లిక్స్, తెలుగులో ‘ఆహా’ వంటి ఓటిటి వేదికలు ముందువరుసలో ఉన్నాయి. అయితే ఇటీవలే కేరళ ప్రభుత్వం త్వరలో ఒక సొంత ఓటిటిని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా చిన్న-బడ్జెట్ చిత్రాలకు మద్దతు ఇవ్వనుంది. ఈ వేదిక రాష్ట్రవ్యాప్తంగా చిత్రనిర్మాతలు నిర్మించే తక్కువ బడ్జెట్, ఆఫ్‌బీట్ చిత్రాలను విస్తృతంగా ప్రసారం చేస్తుంది. అయితే తాజాగా మరో రాష్ట్రం కూడా అదే బాటలో నడవడానికి సన్నద్ధమైనట్టు తెలుస్తోంది.
Read Also : ఇన్‌స్టాగ్రామ్ రిచ్‌లిస్ట్ లో స్టార్ హీరో కూతురు…!
తమిళనాడు ప్రభుత్వం తన స్వంత ఓటిటి సేవను ప్రారంభించడంలో కేరళ ప్రభుత్వాన్ని అనుసరించాలని నిర్ణయించింది. చిన్న తరహా చిత్రనిర్మాతలకు మద్దతు ఇవ్వడానికి తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేక ఓటిటి ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించి, చిన్న తరహా చిత్రాలను ప్రసారం చేస్తుంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నారు. జంట తెలుగు రాష్ట్రాలు కూడా ఈ తరహాలోనే సొంత ఓటిటికి సన్నాహాలు చేస్తే చిన్న చిత్ర నిర్మాతలకు ఆసరాగా ఉంటుంది. ప్రభుత్వం గనుక ఈ దిశగా అడుగులేస్తే థియేటర్లు దొరకకపోవడం వంటి సమస్యతో, పెద్ద సినిమాల విడుదల నేపథ్యంలో విడుదలకు నోచుకోలేని ఎన్నో చిన్న చిత్రాల దర్శకనిర్మాతలు హాయిగా ఊపిరిపీల్చుకుంటారు.
