కొవిడ్ తమిళనాట కూడా విలయతాండవం చేస్తోంది. కరోనా మహమ్మారి బారిన పడి తమిళ దర్శకుడు తమిర కన్నుమూశారు. కె. బాలచందర్, భారతీరాజా దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన తమిర 2010లో ‘రెట్టైసుళి’ చిత్రం రూపొందించారు. విశేషం ఏమంటే ఇందులో ఆయన గురువులు బాలచందర్, భారతీరాజా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు శంకర్ నిర్మించాడు. అయితే కమర్షియల్ గా ఈ సినిమా పెద్దంత విజయం సాధించలేదు. 2018లో తమిర ‘ఆన్ దేవతై’ పేరుతో మరో చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. సముతిర కని, రమ్యా పాండియన్, కెవిన్, మోనికా ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా సైతం కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. తాజాగా తమిర ‘మై పర్ ఫెక్ట్ హజ్బెండ్’ పేరుతో ఓ వెబ్ సీరిస్ తీశారు. సత్యరాజ్, సీత ప్రధాన పాత్రలు పోషించిన ఈ వెబ్ సీరిస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కావాల్సి ఉంది. కరోనాతో కొద్ది రోజుల క్రితం హాస్పిటల్ లో చేరిన ఆయన మంగళవారం మరణించారు. ఈ వార్త తెలిసి, కోలీవుడ్ సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.
కరోనాతో కోలీవుడ్ దర్శకుడి మృతి
