NTV Telugu Site icon

Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణకు అనారోగ్యం…ఆస్పత్రిలో చికిత్స

Maxresdefault (1)

Maxresdefault (1)

సూపర్ స్టార్ కృష్ణకు తీవ్ర అనారోగ్యం.. కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు  కృష్ఱ.. భార్య ఇందిరాదేవి ఇటీవల కన్నుమూయడంతో కృంగిపోయిన కృష్ణ… తాజాగా అనారోగ్యం పాలయ్యారు. తెలుగు సినిమా రంగంలో 5 దశాబ్దాల పాటు వెలుగు వెలిగారు కృష్ణ. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా వుందని తెలుస్తోంది.

శ్వాస సంబంధిత వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. నటుడు, దర్శకుడు, నిర్మాతగా ఆయన ఒరవడి సృష్టించారు. కృష్ణ 1970లు, 80ల్లో తెలుగు సినిమా హీరోగా ప్రజాదరణ సాధించి సూపర్ స్టార్‌గా ప్రఖ్యాతి పొందారు. 1964కు ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన కృష్ణకు 1964-65లో హీరోగా నటించిన తొలి సినిమా తేనెమనసులు, మూడవ సినిమా గూఢచారి 116 పరిశ్రమలో నిలదొక్కుకునేందుకు ఉపకరించాయి. ఆపైన నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్‌లో 340 పైచిలుకు సినిమాల్లో ప్రధాన పాత్రలో నటించారు. 1970లో నిర్మాణ సంస్థను ప్రారంభించి పద్మాలయా సంస్థ ద్వారా పలు విజయవంతమైన చలన చిత్రాలు తీశాడు. 1983లో ప్రభుత్వ సహకారంతో స్వంత స్టూడియో పద్మాలయా స్టూడియోను హైదరాబాద్‌లో నెలకొల్పాడు. దర్శకుడిగానూ 16 సినిమాలు తీశాడు.

కృష్ణ నటించిన పలు సినిమాలు తెలుగులో కొత్త ఒరవడిని సృష్టించాయి. కొత్త సాంకేతికతలను పరిచయం చేశాయని చెప్పాలి. తెలుగులో తొలి జేమ్స్‌బాండ్ సినిమా (గూఢచారి 116), తొలి కౌబాయ్ సినిమా (మోసగాళ్ళకు మోసగాడు), తొలి ఫుల్‌స్కోప్ సినిమా (అల్లూరి సీతారామరాజు), తొలి 70 ఎంఎం సినిమా (సింహాసనం) వంటివి కృష్ణ నటించిన సినిమాలే. వీటితో పాటుగా పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, పాడిపంటలు, ఈనాడు, అగ్నిపర్వతం వంటి సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ప్రధానంగా 1976-1985 మధ్యకాలంలో కృష్ణ కెరీర్ అత్యున్నత దశకు అందుకుంది. 1964 నుంచి 1995 వరకు కృష్ణ సగటున పదేళ్ళకు వంద సినిమాలు, అంటే ఏడాదికి 10 సినిమాల చొప్పున 300 సినిమాలు పూర్తిచేశారు. ఇందుకోసం మూడు షిఫ్టులు చొప్పున వేగంగా సినిమాలు పూర్తిచేసేవారు.

ఫిల్మ్‌ఫేర్ సౌత్ జీవిత సాఫల్య పురస్కారం (1997), ఎన్టీఆర్ జాతీయ పురస్కారం (2003), ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ (2008), పద్మభూషణ్ పురస్కారం (2009) లభించాయి. 1984 నుంచి కాంగ్రెస్ ను సమర్ధిస్తూ ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సినిమాలు చేశారు. 1989లో ఏలూరు నియోజకవర్గం నుంచి లోక్‌సభ సభ్యునిగా గెలుపొందారు. కృష్ణ కుటుంబం నుంచి కుమారులు మహేష్ బాబు, రమేష్ బాబు, కుమార్తె మంజుల, చిన్న అల్లుడు సుధీర్ బాబు సినిమా రంగంలోకి వచ్చారు. తోటి నటి అయిన విజయనిర్మలను 1969లో ప్రేమించి రెండవ పెళ్ళి చేసుకున్నాడు. కుమారుడు మహేష్ బాబు పలు విజయాలు అందుకుని ప్రేక్షకుల నుంచి సూపర్ స్టార్ అన్న తండ్రి బిరుదు పొందాడు. విజయ నిర్మల అత్యధిక చిత్రాలు దర్శకత్వం వహించిన మహిళా దర్శకులిగా నిలిచారు. 2010 దశకంలో కృష్ణ నటన నుంచి, రాజకీయాల నుంచి విరమించుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. కృష్ణ భార్యలు విజయనిర్మల, ఇందిరాదేవి ఇటీవల మరణించారు.