Sundar C: సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ దశాబ్దాల తర్వాత ఒకే స్క్రీన్‌పై కనిపిస్తుండటంతో ‘తలైవర్ 173’ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసిన కొద్ది రోజులకే దర్శకుడు సుందర్ సి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాను ఎందుకు ఈ మెగా ప్రాజెక్ట్ వదులుకున్నారో ఆయన వివరించారు.
ఒత్తిడి భరించలేకే తప్పుకున్నాను..
ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడానికి ప్రధాన కారణం తీవ్రమైన ఒత్తిడి అని సుందర్ సి పేర్కొన్నారు. “గత 16 ఏళ్లుగా నాకు నచ్చిన విధంగా, ప్రేక్షకులకు నచ్చే సినిమాలు తీస్తూ వచ్చాను. కానీ ఇలాంటి భారీ బడ్జెట్ సినిమాను హ్యాండిల్ చేసేటప్పుడు నిర్ణయాలు పూర్తిగా నా చేతుల్లో ఉండవు. నేను సులభంగా రాజీపడిపోతానని అనిపించింది” అని ఆయన చెప్పుకొచ్చారు. ప్రాజెక్ట్‌కు, ఇందులో పనిచేసే దిగ్గజ నటులకు తాను న్యాయం చేయలేనని అనిపించి, స్టార్టింగ్‌లోనే తప్పుకోవడం మంచిదని భావించినట్లు తెలిపారు. ఈ విషయాన్ని రజనీకాంత్‌కు స్వయంగా వివరించిన తర్వాతే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
సుందర్ సి తప్పుకున్న తర్వాత, ఈ క్రేజీ ప్రాజెక్ట్ బాధ్యతలను దర్శకుడు సిబి చక్రవర్తి అందుకున్నారు. రజనీకాంత్ సూచించిన కొన్ని మార్పులకు అనుగుణంగా స్క్రిప్ట్‌పై ఆయన ప్రస్తుతం పని చేస్తున్నారు. 2027 పొంగల్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను కమల్ హాసన్ తన సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (RKFI) పై నిర్మిస్తున్నారు. ఇకపోతే సుందర్ సి విషయానికి వస్తే ఆయన దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ బిజీగా ఉన్నారు. ఇటీవల ఆయన గ్యాంగర్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం విశాల్, తమన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పురుషన్ అనే చిత్రంలో కూడా ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. హిప్‌హాప్ తమిజా దీనికి సంగీతం అందిస్తున్నారు.
