SS Rajamouli on Varanasi Movie: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న గ్లోబల్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’. సూపర్ స్టార్ మహేశ్ బాబు, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారతీయ పురాణాలు, చరిత్ర, ఆధునిక సాంకేతికతతో కూడిన వారణాసి 2027 ఏప్రిల్ 7న థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా బ్రెజిల్లో జరిగిన 50వ సావో పాలో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో పాల్గొన్న రాజమౌళి.. వారణాసి నిర్మాణం, కథ, షూటింగ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన గత చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ కంటే 5 నుంచి 6 రెట్లు భారీ స్థాయిలో వారణాసి ఉంటుందని రాజమౌళి వెల్లడించారు.
2022లో విడుదలైన ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు ఆస్కార్ అవార్డును కూడా అందుకుంది. ఇప్పుడు ఆ స్థాయిని మరింత విస్తరించేలా వారణాసిని రాజమౌళి రూపొందిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ కంటే 5-6 రెట్లు పెద్దదిగా వారణాసి ఉంటుందని జక్కన్న తెలిపారు. మహేశ్ బాబు ఇందులో పురావస్తు పరిశోధకుడి పాత్రలో కనిపించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా పెను విపత్తును అడ్డుకునేందుకు ఆయన చేసే సాహసమే ఈ సినిమా ప్రధాన కథాంశం. వారణాసి, అంటార్కిటికా, ఆఫ్రికా వంటి విభిన్న ప్రాంతాల్లో కథ సాగనుంది. భారతీయ పురాణాలు, ప్రాచీన కాలానికి సంబంధించిన అంశాలు కూడా ఇందులో కీలకంగా ఉండనున్నాయి.
వారణాసి షూటింగ్ విషయంలో రాజమౌళి మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ‘ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని పూర్తి చేయడానికి 315 రోజుల సమయం పట్టింది. వారణాసి అంతకంటే భారీ సినిమా. అయినప్పటికీ షూటింగ్‌ను 275 రోజుల్లో పూర్తి చేస్తున్నాం. అంటే గత చిత్రంతో పోలిస్తే 40 రోజుల షూటింగ్ సమయాన్ని ఆదా చేశాం. ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి నేర్చుకున్న పాఠాలను వారణాసి నిర్మాణంకు ఉపయోగపడింది. ఈసారి షూటింగ్ ప్రారంభించడానికి ముందే మరింత ఎక్కువగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నా. పూర్తి సన్నద్ధతతో చిత్రీకరణలోకి వెళ్లా. ముందస్తు ప్రణాళిక, పేపర్‌వర్క్ వల్ల భారీ సినిమా అయినప్పటికీ షూటింగ్ సమయాన్ని తగ్గించగలిగా’ అని జక్కన్న చెప్పుకొచ్చారు.

