Site icon NTV Telugu

Srimad Bhagavatam : ఇండీవుడ్లో నెక్ట్స్ బిగ్ థింగ్.. “శ్రీమద్ భాగవతం పార్ట్-1” రేవంత్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం

Srimad Bhagavatam

Srimad Bhagavatam

హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక రామోజీ ఫిల్మ్ సిటీలో “శ్రీమద్ భాగవతం పార్ట్-1” చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రంగారెడ్డి తదితర ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

సాగర్ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఆకాష్ సాగర్ చోప్రా నిర్మాణ సారథ్యంలో రూపొందనున్న ఈ చిత్రం సాంస్కృతిక, ఆధ్యాత్మిక విలువలను ప్రతిబింబించే ఒక గొప్ప ప్రయత్నంగా భావిస్తున్నారు. “శ్రీమద్ భాగవతం” వంటి గాఢమైన ఆధ్యాత్మిక కథాంశం ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభవాన్ని అందించనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, “తరం మారుతున్న ఈ సమయంలో ‘శ్రీమద్ భాగవతం’ లాంటి సినిమాలు చాలా అవసరం. రామాయణం సీరియల్ ద్వారా దూరదర్శన్ ప్రజలకు దగ్గరైనట్లుగా, ఇలాంటి సినిమాలు మన సంస్కృతిని, విలువలను యువతకు పరిచయం చేస్తాయి.” తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ దృష్టిని వివరిస్తూ, “మా విజన్ డాక్యుమెంట్‌లో సినిమా ఇండస్ట్రీకి కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంది. 1 ట్రిలియన్ నుండి 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నాము. రాబోయే రోజుల్లో హాలీవుడ్ సినిమాలు కూడా హైదరాబాద్‌లో షూటింగ్ చేసే స్థాయికి ఎదగాలని మా ఆకాంక్ష,” అని ఆయన పేర్కొన్నారు.

ఈ చిత్రం తెలంగాణలో సినిమా పరిశ్రమకు కొత్త ఊపిరి పోసే అవకాశం ఉందని, రామోజీ ఫిల్మ్ సిటీ వంటి అత్యాధునిక సౌకర్యాలు దీనికి దోహదపడతాయని సినీ పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. “శ్రీమద్ భాగవతం పార్ట్-1” చిత్రం తెలుగు సినిమా ఖ్యాతిని మరింత పెంచే దిశగా ఒక ముందడుగుగా భావిస్తున్నారు.

Exit mobile version