‘బిచ్చగాడు’ సినిమాతో తెలుగువారి మనసుల్ని దోచుకున్నాడు దర్శకుడు శశి. అతని తాజా చిత్రం ‘సివప్పు మంజల్ పచ్చై’ను తెలుగులో ‘ఒరేయ్ బామ్మర్ది’ పేరుతో డబ్ చేసి, ఎ. ఎన్. బాలాజీ ఈ నెల 13న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు శశి మాట్లాడుతూ, ”నేను గతంలో రూపొందించిన ‘శ్రీను, రోజాపూలు, బిచ్చగాడు’ చిత్రాలు తెలుగు వారిని ఆకట్టుకున్నాయి. సెంటిమెంట్ సినిమాలంటే టాలీవుడ్ ఆడియెన్స్ ప్రాణమిస్తారు. అదే నమ్మకంతో నేను తమిళంలో తీసిన ‘సివప్పు మంజల్ పచ్చై’ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనే మొదట అనుకున్నాం. కానీ కుదరకపోవడంతో డబ్ చేశాం” అని చెప్పారు.
‘ఓరేయ్ బామ్మర్ది’ కథను మొదట హీరో సిద్దార్థ్ కు చెప్పి బావమరిది పాత్ర చేయమని కోరానని, అయితే ఆయన బావ పాత్ర చేయడానికి ఆసక్తి చూపారని శశి తెలిపారు. దాంతో ఆయన బావమరిది పాత్రకు జీవీ ప్రకాశ్ ను ఎంపిక చేశామని అన్నారు. ఈ నెల 13న తెలుగు వారి ముందుకు రాబోతున్న ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతుందనే ఆశాభావాన్ని శశి వ్యక్తం చేశారు.
