Site icon NTV Telugu

ఆగస్టులో ‘సావిత్రి w/o సత్యమూర్తి’

అరవైయేళ్ల మహిళకు పాతికేళ్ల కుర్రాడు ఎలా భర్త అయ్యాడు? వాళ్లిద్దరూ ఎందుకు పెళ్లి చేసుకున్నారు? జీవితాంతం కలిసుండాలని ఎలా నిర్ణయించుకున్నారు? అనే కథాంశంతో రూపొందుతున్న స్వచ్ఛమైన వినోదాత్మక కుటుంబకథా చిత్రం ‘సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి’. పాతికేళ్ల కుర్రాడిగా ‘కేరింత’ ఫేమ్ పార్వతీశం, అతని భార్య పాత్రలో అరవైయేళ్ల మహిళగా హాస్యనటి శ్రీలక్ష్మి వెండితెరపై సందడి చేయనున్నారు. గోగుల నరేంద్ర నిర్మిస్తున్న ఈ సినిమాతో పూరి జగన్నాథ్ శిష్యుడు చైతన్య కొండ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

నిర్మాత గోగుల నరేంద్ర మాట్లాడుతూ “ఈ సినిమాతో ముగ్గురు కొత్త కథానాయికలను పరిచయం చేస్తున్నాం. త్వరలో వాళ్లను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. హైదరాబాద్, అరకు, ఈస్ట్ గోదావరి, వైజాగ్ పరిసర ప్రాంతాల్లో 45 రోజులు చిత్రీకరణ చేశాం. విశాఖలో గుమ్మడికాయ కొట్టేశాం. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాటిని త్వరగా పూర్తి చేసి ఆగస్టు మూడో వారంలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం. అన్ని వర్గాలను, అన్ని వయసుల వాళ్లను అలరించే చిత్రమిది” అని అన్నారు. శివారెడ్డి, సుమన్ శెట్టి, గౌతంరాజు, అనంత్, జెన్ని, సుబ్బరాయశర్మ, కోట శంకరావు, పద్మజయంతి ఇందులో ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.

Exit mobile version