NTV Telugu Site icon

Sampoornesh Babu Birthday Special: ‘బర్నింగ్ స్టార్’ సంపూర్ణేష్ బాబు

Sampurnesh Babu

Sampurnesh Babu

వెండితెరపై వెలిగిపోవాలనే అభిలాష ఎంతోమందికి ఉంటుంది. అయితే, కొందరినే ఆ వెలిగే అదృష్టం వరిస్తుంది. తనదైన అభినయంతో నవ్వులు పూయిస్తూ ఎంతోమందిని ఆకట్టుకున్నాడు సంపూర్ణేశ్ బాబు. తెలివితేటలు ఉంటే అందని ద్రాక్షను కూడా అందుకోవచ్చు అంటారు. అదే పంథాలో పయనించి, తనను తాను జనానికి పరిచయం చేసుకున్నాడు. సోషల్ మీడియా వేదికగా సంపూర్ణేశ్ బాబు భలేగా ప్రచారం పొందాడు. ఆ పైనే హీరోగా జనం ముందు నిలిచాడు. సంపూర్ణేశ్ బాబును చూడగానే పక్కుమని నవ్వేవారు ఎందరో! ఆ నవ్వులే అతనికి దన్నుగా నిలిచాయి. ఇప్పటికీ హీరో వేషాలు అందిస్తూనే ఉన్నాయి.

సంపూర్ణేశ్ బాబు 1972 మే 9న సిద్ధిపేట జిల్లా మెట్టపల్లిలో జన్మించాడు. అతని అసలు పేరు నరసింహాచారి. పేద విశ్వబ్రాహ్మణ కుటుంబం. బంగారు, వెండి పనిచేస్తూ ఉండేవారు. చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో అన్న పాలనలో పెరిగాడు సంపూర్ణేశ్. పదో తరగతి కాగానే సిద్ధిపేటలో సంపూర్ణేశ్ కు కూడా పని నేర్పించి, బంగారు, వెండి ఆభరణాలు చేసే దుకాణం పెట్టించారు. అక్కడ పనిచేస్తూనే హైదరాబాద్ వచ్చినప్పుడు తెగ సినిమాలు చూసేవాడు సంపూర్ణేశ్. తాను సినిమాల్లో నటించాలని, ఓ వెలుగు వెలగాలని ఆశించాడు. అందుకు తగ్గ ప్రణాళికను మనసులో రూపొందించుకున్నాడు. సిద్ధిపేటలోనే ఉన్న మరోనటుని వద్ద నటనలో శిక్షణ తీసుకున్నాడు. కృష్ణవంశీ తెరకెక్కించిన ‘మహాత్మ’ చిత్రంలో ఓ చిన్న పాత్రలో తొలుత కనిపించాడు సంపూర్ణేశ్. ఆ తరువాత రాజేశ్ అనే దర్శకునితో పరిచయం ఏర్పడింది. ఆయన కూడా చిత్రసీమలో తనదైన బాణీ పలికించాలని ఆశిస్తున్న రోజులవి. రాజేశ్ తన పేరును స్టీవెన్ శంకర్ గా మార్చుకొని, సినిమా ఫ్రీడమ్ పై సెటైరిక్ గా ‘హృదయ కాలేయం’ అనే సినిమాను తెరకెక్కిస్తూ అందులో సంపూర్ణేశ్ బాబును నాయకునిగా ఎంచుకున్నాడు. ఈ సినిమాకు ముందు నుంచే సోషల్ మీడియాలో సంపూర్ణేశ్ బాబు తనదైన పంథాలో ప్రచారం మొదలు పెట్టాడు. త్వరలోనే యూత్ ను ఆకట్టుకోగలిగాడు. ‘హృదయ కాలేయం’ టైటిల్ లోనే ఓ వైవిధ్యం కనిపించింది. సినిమా విడుదలయ్యాక జనం పొట్టలు చెక్కలు చేసేసింది. దాంతో సంపూర్ణేశ్ బాబు తొలి ప్రయత్నంలోనే హీరోగా మార్కులు సంపాదించాడు.

‘హృదయ కాలేయం’ తో పేరు లభించిన సంపూర్ణేశ్ బాబుకు మంచు మనోజ్ నటించిన ‘కరెంట్ తీగ’లో కేమియో అప్పియరెన్స్ అవకాశం లభించింది. అందునా అందులో సెక్సిణి సన్నీ లియోన్ కాబోయే భర్తగా కాసేపు తెరపై కనిపించి, మెరుపులు మెరిపించాడు సంపూర్ణేశ్. ఆపై “పెసరట్టు, బందిపోటు, జ్యోతిలక్ష్మి, రాజా ది గ్రేట్, దేవదాస్, కథనం” చిత్రాలలో అతిథి పాత్రల్లోనూ మెప్పించాడు బాబు. ఇక “వేరీజ్ విద్యాబాలన్, లచ్చిందేవికి ఓ లెక్కుంది, భద్రం బీ కేర్ ఫుల్ బ్రదరూ” చిత్రాల్లో కీలక పాత్రలు పోషించాడు. సూర్య ‘సింగం’ సిరీస్ పై సెటైర్ గా ‘సింగం 123’ లో నటించి నవ్వులు పూయించాడు. ‘కొబ్బరిమట్ట’లో ఏకంగా త్రిపాత్రాభినయం చేసి మురిపించాడు. “బజారు రౌడీ, కాలీఫ్లవర్” సినిమాల్లోనూ హీరోగానే అలరించాడు సంపూర్ణేశ్. అతని బర్త్ డే న ఆయన హీరోగా కొత్త సినిమా షూటింగ్ మొదలు కానుంది.

చిన్నతనంలో పేదరికం అనుభవించిన సంపూర్ణేశ్ బాబు ఎవరైనా ఆపదలో ఉంటే తనకు చేతనైన సాయం అందించడానికి ముందుంటాడు. ఇప్పటికీ అతి సాధారణజీవితం గడపడంలోనే తనకు ఆనందం ఉందని అంటాడు. అప్పుడప్పుడూ సిద్ధిపేట నుండి హైదరాబాద్ కు బస్సులోనే ప్రయాణిస్తూ సందడి చేస్తుంటాడు. ఏది ఏమైనా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న సంపూర్ణేశ్ బాబు ‘బర్నింగ్ స్టార్’గా తనను తాను ప్రకటించుకొని, ఆ పేరుతోనే జనాల్లో ప్రాచుర్యం సంపాదించడం విశేషం!