Site icon NTV Telugu

Samantha: ఇంకా ఏదో చేయాలనే ఉండేది.. ‘ట్రాలాలా’ వెనుక కథ ఇదే!

Samantha Subam

Samantha Subam

ప్రముఖ నటి, నిర్మాత సమంత తన ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న తొలి చిత్రం శుభం. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో, వివేక్ సాగర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, క్లింటన్ సెరెజో సంగీతంతో రూపొందిన ఈ చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా సమంత మీడియాతో చిత్ర విశేషాలు పంచుకున్నారు.

ప్ర: నిర్మాతగా మొదటి చిత్రం శుభం గురించి ఎలా ఫీల్ అవుతున్నారు?
నటిగా శుక్రవారాల అనుభవం ఉంది, కానీ నిర్మాతగా ఇది నా తొలి శుక్రవారం. చాలా ఉత్కంఠగా, నర్వస్‌గా ఉన్నాను. నిర్మాత కష్టాలు ఇప్పుడు అర్థమయ్యాయి. గత వారంగా నిద్రలేని రాత్రులు గడిచాయి. పోస్ట్-ప్రొడక్షన్, మిక్సింగ్, ఎడిటింగ్ టీమ్ నిద్రపోకుండా కష్టపడింది. శుభం చాలా బాగా వచ్చింది, కథపై నాకు పూర్తి నమ్మకం ఉంది.

ప్ర: నిర్మాతగా అడుగుపెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది?
నటిగా అభిమానం, అనుభవం పొందాను, కానీ ఇంకా ఏదో చేయాలనే తపన ఉండేది. బ్రేక్ సమయంలో ఆలోచించాను—నటన కాకపోతే సినిమాలు నిర్మించొచ్చని. 15 ఏళ్ల కెరీర్ అనుభవంతో ట్రా లా లా ప్రొడక్షన్ స్థాపించాను. శుభంని 8 నెలల్లో పూర్తి చేసి, ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం.

ప్ర: శుభం టైటిల్, ట్రా లా లా పేరు వెనుక కథ ఏమిటి?
శుభం కథలో సీరియల్ కీలకం. సీరియల్‌లో ‘శుభం’ కార్డ్ కోసం అంతా ఎదురుచూస్తారు, అందుకే ఈ టైటిల్. ట్రా లా లా పేరు చిన్నప్పటి ‘బ్రౌన్ గర్ల్ ఇన్ ది రెయిన్’ పద్యం నుంచి తీసుకున్నాం.

ప్ర: కొత్త వారిని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు?
గౌతమ్ మీనన్ గారు నాకు తొలి అవకాశం ఇచ్చారు. ఆయన టాప్ హీరోయిన్‌ని తీసుకోకుండా నా లాంటి కొత్తవారికి ఛాన్స్ ఇచ్చారు. నేనూ నిర్మాతగా కొత్త ప్రతిభను ప్రోత్సహించాలనుకుంటున్నాను.

*ప్ర: శుభంలో నటీనటులు ఎలా కనిపిస్తారు?*
శ్రియా, శ్రావణి, షాలినీలు ఎంతో కష్టపడ్డారు. వారిని చూస్తే నా పాత రోజులు గుర్తొచ్చాయి. కలలతో ఇండస్ట్రీలోకి వచ్చిన వారికి ఈ సినిమా ఒక అవకాశం.

ప్ర: నిర్మాతగా కష్టాలు ఏమిటి?
నటిగా నిర్మాత కష్టాలు అర్థం కాలేదు. ఒక సీన్ సరిగా జరగకపోతే ఎంత నష్టం, డబ్బు, సమయం వృథా అవుతుందో ఇప్పుడు తెలిసింది.

*ప్ర: శుభంలో మీ కామియో పాత్ర గురించి?*
ఆ పాత్ర నేను చేయాలనుకోలేదు, కానీ నిర్మాతగా ఎవరినీ ఫేవర్ అడగడం ఇష్టం లేదు. అందుకే నేనే చేశాను. సినిమాను మూడు-నాలుగు రోజులు ప్రమోట్ చేస్తాను, తర్వాత ప్రేక్షకులే దీన్ని నడిపిస్తారని ఆశిస్తున్నాను.

ప్ర: శుభం బడ్జెట్ గురించి?
సినిమాకు ఎంత ఖర్చు కావాలో అంతే పెట్టాం. తక్కువ కాదు, ఎక్కువ కాదు. చూస్తే అందరికీ అర్థమవుతుంది.

ప్ర: ఇతర ప్రాజెక్ట్‌ల గురించి?
ప్రస్తుతం మా ఇంటి బంగారం చేస్తున్నాను. జూన్ నుంచి షూటింగ్ మొదలవుతుంది. అట్లీ గారితో మంచి సంబంధం ఉంది, భవిష్యత్తులో కలిసి పనిచేయొచ్చు.

ప్ర: శుభం కథ ఏమిటి?
వసంత్ రాసిన కథ సీరియల్స్ చుట్టూ తిరుగుతుంది. సోషల్ సెటైర్ ఉంటుంది, కానీ మెసేజ్ ఉందా లేదా అనేది ప్రేక్షకులే చెప్పాలి. హారర్, కామెడీ కాకుండా ప్రత్యేకమైన అనుభవం ఇస్తుంది.

ప్ర: సినిమా నాణ్యతపై ఎంత శ్రద్ధ తీసుకున్నారు?
నేను నా పనిని విమర్శించుకుంటాను. శుభంలో ఎక్కడా బోర్ కొట్టకుండా ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు జాగ్రత్తగా ఎడిట్ చేశాం.

ప్ర: నిర్మాతగా మీ విధానం ఏమిటి?
స్మార్ట్ ప్రొడ్యూసర్ కాకపోవచ్చు, బిజినెస్ గురించి పూర్తిగా తెలియకపోవచ్చు, కానీ మనసుకు నచ్చిన కథనే చేశాను. శుభం అందరి అంచనాలు అందుకుంటుందని నమ్ముతున్నాను.

ప్ర: అభిమాని గుడి కట్టిన సంఘటన గురించి?
అది తెలిసి ఆశ్చర్యపోయాను. అంత ప్రేమ చూపిస్తారని అనుకోలేదు. కానీ గుళ్లు, పూజల వంటివి నేను ప్రోత్సహించను.

ప్ర: శుభం రిలీజ్ డేట్, సంగీతం గురించి?
మే 9 సమ్మర్ హాలిడేస్‌లో మంచి డేట్. కుటుంబంతో చూడటానికి అనువైన సమయం. క్లింటన్ సెరెజో పాటలు పాత కాలాన్ని గుర్తు చేస్తాయి. వివేక్ సాగర్ బీజీఎం అద్భుతంగా ఉంటుంది.

ప్ర: ప్రేక్షకులకు సందేశం?
మే 9న శుభం విడుదలవుతోంది. కుటుంబంతో కలిసి చూసి, మా చిత్రాన్ని సక్సెస్ చేయండి. మీ అందరి మద్దతు మాకు కావాలి!

Exit mobile version