Site icon NTV Telugu

‘శాకుంతలం’పై దృష్టి పెట్టిన సమంత!

Samantha Concentration on Shakunthalam

తొలిసారి వెబ్ సీరిస్ లో నటించిన స్టార్ హీరోయిన్ సమంత తన కాన్ టెంపరరీ హీరోయిన్స్ కాజల్, తమన్నాను మించిన గుర్తింపును తెచ్చుకుంది. హారర్ వెబ్ సీరిస్ లో నటించిన కాజల్ కు పెద్దంత పేరు రాలేదు. అయితే తమన్నా మాత్రం ఇటు తెలుగు, అటు తమిళ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ వెబ్ సీరిస్ చేసి… ఫర్వాలేదని పించింది. అయితే ఒకటి వ్యాపార సామ్రాజ్యానికి చెందింది, మరొకటి థ్రిల్లర్ జానర్ కు సంబంధించింది కావడం కొన్ని వర్గాలను మాత్రమే ఈ రెండు వెబ్ సీరిస్ మెప్పించగలిగాయి. కానీ సమంత ఎంచుకున్న దారి వేరు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఓ గుర్తింపు తెచ్చుకున్న ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో నటించింది సమ్ము. అన్ని వర్గాలను అలరించే అంశాలు ఇందులో ఉండటం ఒక ఎత్తు అయితే… తమిళ తీవ్రవాదిగా అత్యంత కీలకమైన పాత్ర సమంత చేయడం మరో ఎత్తుగా మారింది. రకరకాల వివాదాల నడుమ స్ట్రీమింగ్ అయిన ఈ వెబ్ సీరిస్ ఆశించిన దానికంటే సక్సెస్ సాధించింది. దాంతో ఇప్పటికే సెట్స్ పై ఉన్న పాన్ ఇండియా మూవీ శాకుంతలం'పై కూడా సక్సెస్ ప్రభావం పడుతోంది. అందువల్ల సమంత పూర్తి స్థాయిలో 'శాకుంతలం' మూవీపై దృష్టి పెట్టిందట. చిన్నప్పటి నుండీ ఫేరీ టేల్స్ అంటే ఎంతో ఇష్టమైన సమంత... నటిగా అలాంటి ఓ రాజకుమార్తె పాత్ర పోషించాలని కలలు కంటూ ఉందట. వెదకబోయిన తీగ కాలికి తగిలినట్టుగా... సమంతను 'శాకుంతలం' సినిమా వరించింది. అందుకే ఎంతో మనసు పెట్టి ఆ పాత్రకు ప్రాణం పోస్తోందట. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ కు కొంతకాలం బ్రేక్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ ఈ నెలాఖరు నుండి తిరిగి షూటింగ్ ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే 40 రోజుల పాటు చిత్రీకరణ జరుపుకుంది. మరో నలభై రోజులు షూటింగ్ చేయాల్సి ఉంది. సమంత సైతం ఈ నెలాఖరులో ప్రారంభం కాబోయే షెడ్యూల్ లో పాల్గొనబోతోంది. విశేషం... ఏమంటే...ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2తో సమంతకు జాతీయ స్థాయిలో వచ్చిన గుర్తింపు కూడా ‘శాకుంతలం’కు ప్లస్ కానుంది.

Exit mobile version