NTV Telugu Site icon

స‌రికొత్త మార్గం చూపిన స‌ల్మాన్ రాధే!

బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ నయా మూవీ రాధేని చూసి స‌గ‌టు సినిమా ప్రేక్ష‌కుడు సైతం పెద‌వి విరుస్తున్నా… ఆ మూవీ ఎలా ఉందో ఓసారి చూసేస్తే పోలా అనే భావ‌నే అత్య‌ధికశాతం మంది సినీ అభిమానులు వ్య‌క్తం చేస్తున్నారు. పైగా ఇటు విదేశాల‌లో థియేట‌ర్ల‌లోనూ, ప‌లు దేశాల్లో పే ఫ‌ర్ వ్యూ ప‌ద్ధ‌తిలోనూ ఈ సినిమాను చూసే అవ‌కాశం నిర్మాత‌లు క‌ల్పించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే… ప్ర‌పంచ‌వ్యాప్తంగా 65 దేశాల‌లో యాపిల్ టీవీ (ఐ ట్యూన్స్) ద్వారా లైవ్ అయిన తొలి హిందీ చిత్రంగా రాధే ఓ రికార్డ్ సృష్టించింది.

అంతేకాదు… ఈ సినిమా మీద ఎంత నెగెటివ్ టాక్ ఉన్నా… తొలిరోజున లైవ్ లో మొత్తంగా 42 ల‌క్ష‌ల మంది రాధే చిత్రాన్ని వీక్షించార‌ని యాపిల్ టీవీ సంస్థ ప్ర‌క‌టించింది. ఆఫ్రికా, ఆసియా, యూర‌ప్ ఖండాల‌లో 65కు పైగా దేశాల‌లో దీనిని జ‌నం చూశారు. వీటిలో బెల్గేరియా, డెన్మార్క్, కెన‌డా, ఫిజీ, మ‌లేసియా, శ్రీలంక‌, సౌత్ ఆఫ్రికా, మారిష‌స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ల‌భించిన ఆద‌ర‌ణ‌ను దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో మ‌రిన్ని దేశాల‌లో దీనిని ప్ర‌సారం చేసే ప‌నిలో ప‌డ్డారు ఫిల్మ్ మేక‌ర్స్. యాపిల్ టీవీతో పాటుగా రాధే కెన‌డాలో బెల్ ఫెబీ టీవీ, ఆప్టిక్ టీవీ; ఆఫ్రికాలోని బాక్సాఫీస్ డీఎస్ టీవీ ల‌లో ప్ర‌సారం అవుతోంది. అలానే జీ 5తో పాటు క‌రేబియ‌న్ లోనూ ఫ్లో ఆన్ డిమాండ్ ప‌ద్ధ‌తిలో సినిమాను చూసే ఆస్కారం క‌ల్పిస్తున్నారు. మొత్తం మీద భార‌తీయ సినిమా రంగంలోనే తొలిసారి ఇన్ని ర‌కాలుగా, ఇన్ని దేశాల‌లో త‌మ‌ సినిమాను ప్ర‌సారం చేసి, నిర్మాత‌లు డ‌బ్బులు గ‌డిస్తున్నారు. మ‌రి ఈ పంథాను ఇంకెంత‌మంది బాలీవుడ్ నిర్మాత‌లు ఫాలో అవుతారో చూడాలి.