హీరోగా స్టార్‌డమ్ అందుకోవడం అంత తేలికైన విషయం కాదు. సినిమా కుటుంబం నుంచి వచ్చినా కూడా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి టాలెంట్, కష్టపడి పనిచేయడం, అలాగే కొంత అదృష్టం కూడా అవసరం. ఈ విషయాన్ని తన కెరీర్ అనుభవాలతో తాజాగా వెల్లడించారు బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్. ప్రజంట్ స్టార్ హీరో హోదాలో ఉన్నప్పటికీ ఈ స్థాయికి రావడానికి చాలానే కష్టపడ్డాడట.
తన తల్లి శర్మిలా టాగోర్ బిగ్ స్టార్, తండ్రి క్రికెట్ లెజెండ్ మన్‌సూర్ అలీ ఖాన్ పటౌడి. ఇంత బలమైన నేపథ్యం ఉన్నప్పటికీ, తన ప్రయాణం అంత సులభం కాలేదని సైఫ్ అన్నారు. ‘బ్యాగ్రౌండ్ ఉన్నంత మాత్రాన ఇండస్ట్రీలో రాణిస్తారని అనుకోవడం తప్పు. నాకు కూడా ప్రారంభంలో అవకాశాలు చాలా తక్కువ వచ్చాయి. హీరో కావాలన్న కలతో ఇండస్ట్రీకి వచ్చాను కానీ, లీడ్ రోల్స్ దొరకలేదు. అందుకే సెకండ్, థర్డ్ లీడ్ పాత్రల్లో నటించాల్సి వచ్చింది’ అని చెప్పారు. అలాగే తన కెరీర్ ప్రారంభ దశలో అవకాశాల కోసం ఎంత కష్టపడ్డాడో గుర్తుచేసుకున్నారు సైఫ్.. ‘ఒకానొక సమయంలో పాత్రల కోసం స్టూడియోల చుట్టూ తిరగాల్సి వచ్చింది. చాలాసార్లు నమ్మకం కోల్పోయాను, కానీ వదిలేయాలని అనిపించలేదు. క్రమంగా చిన్న పాత్రలు చేస్తూ నను నేను నిరూపించుకున్నాను’ అని అన్నారు.
తన కెరీర్‌లో ఎదురైన ఓ ఆసక్తికర సంఘటనను కూడా పంచుకున్నారు.. ‘ఆ రోజుల్లో నా ఖర్చులకు డబ్బల కోసం చాలా కష్టమయ్యేది. ఓ మహిళా నిర్మాత నాకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండేది. కానీ డబ్బులు ఇవ్వడానికి ఆమె ఒక షరతు పెట్టింది – తన బుగ్గపై ముద్దు పెట్టాలని. అలా చేస్తేనే వారానికి వెయ్యి రూపాయలు ఇస్తానని చెప్పేది. నేను ఒకటి కాదు పది ముద్దులు పెట్టి, ఆ వెయ్యి రూపాయలు తీసుకునే వాడిని’ అంటూ నవ్వుతూ గుర్తు చేసుకున్నారు సైఫ్ అలీ ఖాన్. ఒక సమయంలో కష్టాలు చాలా ఎదురైనా, నమ్మకంతో ముందుకు వెళ్తే తప్పక ఫలితం వస్తుంది. కెరీర్‌లో నేర్చుకున్న అతిపెద్ద పాఠం అదే అని తెలిపాడు.
