Renu Desai: ‘ఓం’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ధనుష్‌కు సారీ చెప్పిన రేణు దేశాయ్.. ఎందుకంటే?

Renu Desai Apologizes To Dhanush

Renu Desai Apologizes To Dhanush

Renu Desai: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ చిత్రం ‘ఓం’ (O.M). రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తెలుగులో నిర్వహించిన ప్రీ-రిలీజ్ వేడుకలో నటి రేణు దేశాయ్ సందడి చేశారు. అయితే, ఈ వేడుకలో మాట్లాడుతూ రేణు దేశాయ్ అందరి ముందే హీరో ధనుష్‌కు సారీ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఆమె ఎందుకు క్షమాపణ చెప్పారో తెలిస్తే నవ్వుకుంటారు.

ఈ సినిమా షూటింగ్ సమయంలో తనకు తమిళ భాష సరిగ్గా రాక ఇబ్బంది పడిన విషయాన్ని రేణు దేశాయ్ స్టేజ్‌పై సరదాగా పంచుకున్నారు. “ధనుష్ సర్.. నా తమిళ తప్పులను ఎంతో ఓపికగా భరించినందుకు థాంక్యూ సో మచ్. కొన్నిసార్లు మీకు కూడా ‘ఈమె తమిళం ఎందుకు సరిగ్గా మాట్లాడలేకపోతోంది’ అని అనిపించి ఉంటుంది, అందుకు ఐ యామ్ సో సారీ” అంటూ రేణు దేశాయ్ చెప్పడంతో ఆడిటోరియంలో నవ్వులు విరిశాయి. తమిళంలో డైలాగ్స్ చెప్పేటప్పుడు తాను చేసిన పొరపాట్లను ధనుష్ ఎంతో సహనంతో అర్థం చేసుకుని సహకరించారని ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

ఇక ఈ సినిమా తనకు ఎలా వచ్చిందో చెబుతూ రేణు దేశాయ్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మహాశివరాత్రి రోజున తాను కామాఖ్య దేవి ఆలయంలో ఉండగా ఈ సినిమా కోసం కాల్ వచ్చిందని, ఆలయంలో ఉండగా ‘ఓం’ అనే టైటిల్ వినగానే ఇది కచ్చితంగా దైవానుగ్రహమేనని అనిపించిందని ఎమోషనల్ అయ్యారు. ఎలాంటి లుక్ టెస్ట్ లేకుండానే తనను తీసుకున్న డైరెక్టర్ రాజ్‌కుమార్‌కు దండం పెట్టాలన్నారు. అలాగే, మెగాస్టార్ మమ్ముట్టి ముందు నిలబడి నటించాలంటే తనకు హార్ట్ అటాక్ వచ్చినంత పనైందని, కానీ ఆయన సెట్‌లో ఎంతో కంఫర్టబుల్‌గా చూసుకున్నారని కొనియాడారు. సాయి పల్లవితో సీన్లు లేకపోవడం కాస్త వెలితిగా ఉన్నా, శ్రీలీలతో బాగా ఎంజాయ్ చేశానని.. నవంబర్ 20న అందరూ థియేటర్లలో సినిమా చూసి తన నటన ఎలా ఉందో చెప్పాలని రేణు దేశాయ్ కోరారు.