(ఏప్రిల్ 17న సౌందర్య వర్ధంతి)
కొందరిని చూడగానే, మనకు బాగా పరిచయం ఉన్నవారిలా కనిపిస్తారు. ఇక వారిలో అందం, చందం రెండూ ఉంటే, వారికి మరింత దగ్గరగా కావాలనీ భావిస్తాము. కన్నడనాట పుట్టినా, తెలుగు చిత్రాలలో భలేగా మెరిసిన అందాల అభినేత్రి సౌందర్యను చూసి మన జనం అలాగే భావించారు. ఆమె ముగ్ధమనోహర రూపం చూసి, ఇలాంటి అమ్మాయి పరిచయమయితే ఎంత బాగుంటుందో అనుకుంటూ కలల్లో తేలిపోయినవారూ ఉన్నారు. సౌందర్య లాంటి అమ్మాయి కావాలని కోరుకున్న తల్లిదండ్రులూ లేకపోలేదు. అలాంటి నేస్తం ఉంటే బాగుంటుందని భావించిన మనసులకూ కొదువలేదు. ఏమయితేనేమి, వెరసి సౌందర్య అందాన్ని, ఆమె అభినయాన్ని తెలుగువారు విశేషంగా అభిమానించారు. నిజానికి సౌందర్య మాతృభాష కన్నడలో కన్నా మిన్నగా తెలుగు చిత్రసీమలో వెలుగులు చూశారు.
వెంకీ హిట్ పెయిర్!
సౌందర్య అసలు పేరు సౌమ్య. కన్నడ నాట జన్మించిన సౌందర్య తండ్రి సత్యనారాయణకు చిత్రసీమతో అనుబంధం ఉంది. ఆయన రచయితగా, నిర్మాతగా కన్నడ నాట సాగారు. అందువల్ల చదువుల్లో ఎంతో తెలివైన సౌందర్యకు సినిమాల్లో కనిపించాలన్న ధ్యాస కూడా అధికంగా ఉండేది. దాంతో ఎమ్.బి.బి.ఎస్. తొలి సంవత్సరం పూర్తి కాగానే, తన మనసులోని మాటను కన్నవారి ముందు పెట్టింది. అసలే, ఆమె తండ్రి కూడా చిత్రసీమకు సంబంధించిన వారు కావడంతో కూతురు కోరికను కాదనలేకపోయారు. ‘గంధర్వ’ అనే కన్నడ చిత్రంలో తొలిసారి నటించిన సౌందర్య అదే సంవత్సరం తెలుగులో పి.ఎన్.రామచంద్రరావు రూపొందించిన ‘మనవరాలి పెళ్ళి’లో నటించారు. ఆ సమయంలోనే కృష్ణ హీరోగా తెరకెక్కిన ‘రైతు భారతం’లోనూ ఆమెకు అవకాశం లభించింది. ఆ చిత్రాలు ఆమెకు అంతగా కలసి రాకున్నా, అప్పట్లోనే దర్శకునిగా మారిన ఎస్వీ కృష్ణారెడ్డి చిత్రాలు “రాజేంద్రుడు – గజేంద్రుడు, మాయలోడు, నంబర్ వన్” సౌందర్యకు స్టార్ డమ్ సంపాదించి పెట్టాయి. “హలో బ్రదర్, పెదరాయుడు, చూడాలనివుంది” వంటి సూపర్ హిట్స్ లోనూ సౌందర్య అభినయం జనాన్ని ఎంతగానో ఆకట్టుకుంది. “ఇంట్లో ఇల్లాలు- వంటింట్లో ప్రియురాలు, పవిత్రబంధం, పెళ్ళిచేసుకుందాం, రాజా, జయం మనదేరా” వంటి వెంకటేశ్ చిత్రాల ఘనవిజయంతో వెంకీకి హిట్ పెయిర్ గా నిలిచారు సౌందర్య. టాప్ హీరోస్ అందరి సరసన నటించినా, వెంకటేశ్ తోనే ఆమె సక్సెస్ రేట్ ఎక్కువ!
మరో సావిత్రి
‘పవిత్రబంధం, పెళ్ళిచేసుకుందాం’ ఈ రెండు చిత్రాలలో సౌందర్య అభినయం చూసిన తెలుగు జనం ‘మరో సావిత్రి’ అన్నారు . చీరకట్టులోనే కుర్రకారును కిర్రెక్కించిన సౌందర్య, ‘మరో సావిత్రి’ అన్న పేరు నిలుపుకోవడానికి అభినయప్రాధాన్యమున్న చిత్రాలకే జై కొట్టారు. ఆమె నటించిన పలు కుటుంబకథా చిత్రాలు జనాన్ని విశేషంగా అలరించాయి. తరువాతి రోజుల్లో సౌందర్య చుట్టూ తిరిగే కథలతోనే చిత్రాలు రూపొందడం మొదలయ్యాయి. అందువల్ల టాప్ హీరోస్ సినిమాల్లో సౌందర్య వెలగడం తగ్గింది. కానీ, అప్పట్లో సౌందర్య చిత్రాలను చూడటానికి జనం థియేటర్లకు పరుగులు తీశారు. ముఖ్యంగా ఎంతోమంది మహిళలు, సినిమాల్లో సౌందర్య ధరించే చీరలను చూడటానికి ఆమె చిత్రాలను చూసేవారు. అంత క్రేజ్ సంపాదించుకున్న సౌందర్య మాతృభాష కన్నడలో ‘ద్వీప’ అనే చిత్రాన్ని నిర్మించారు. గిరీశ్ కాసరవల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా నిలచింది. ఈ సినిమా ద్వారా హెచ్.ఎమ్. రామచంద్ర హల్కేరే కు బెస్ట్ సినిమాటోగ్రాఫర్ అవార్డు కూడా లభించింది. ఆ ఉత్సాహంతో మళయాళంలో విజయం సాధించిన ‘మణిచిత్రతాళ్’ ను కన్నడలో రీమేక్ చేయాలనుకున్నారు సౌందర్య. అప్పటికే ఈ సినిమా రైట్స్ ను ద్వారకేశ్ సొంతం చేసుకున్నారు. అయితే సౌందర్య అభిలాష తెలిసి, ఆమెతోనే ఆ చిత్రాన్ని ‘ఆప్తమిత్ర’ పేరుతో పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కించారు ద్వారకేశ్. ఆ చిత్రం ఘనవిజయం సాధించింది. ఈ చిత్రం ఆధారంగానే రజనీకాంత్ ‘చంద్రముఖి’ తెరకెక్కింది. సౌందర్య కెరీర్ లో చివరి సూపర్ హిట్ గా ‘ఆప్తమిత్ర’ నిలచింది.
‘నర్తనశాల’లో ద్రౌపది!
సౌందర్యతో ‘టాప్ స్టార్’లో హీరోగా నటించిన బాలకృష్ణ ఆ తరువాత ఆమెతో నటించలేదు. కానీ, తాను దర్శకత్వం చేపట్టి తెరకెక్కించాలనుకున్న పౌరాణిక చిత్రం ‘నర్తనశాల’లో సౌందర్యనే ద్రౌపది పాత్రకు ఎంచుకున్నారు బాలకృష్ణ. ఈ సినిమా ముహూర్తం తరువాత రెండు రోజులు మాత్రమే షూటింగ్ జరుపుకుంది. ఆ తరువాత సౌందర్య 2004లో బీజేపీ తరపున ఎన్నికల ప్రచారం చేయడానికి వెళ్తూ హెలికాప్టర్ క్రాష్ లో మరణించారు. ఆ ప్రమాదంలో ఆమెకు తొలి నుంచీ అండగా నిలచిన ఆమె అన్న అమర్ కూడా కన్నుమూశారు. 2004లో ‘నర్తనశాల’కు శ్రీకారం చుట్టారు. సౌందర్య మరణంతో ఆ సినిమా ఆగిపోయింది. గత సంవత్సరం కరోనా కల్లోలంలో జనాన్ని రంజింప చేయడానికి అన్నట్టు ‘నర్తనశాల’ చిత్రీకరణ జరిపిన సీన్స్ ను ఏటీటీలో విడుదల చేశారు బాలకృష్ణ. సౌందర్య లేకపోయినా, ఆమెను ద్రౌపదిగా చూడాలని ఆశించిన అభిమానులు ‘నర్తనశాల’ అసంపూర్ణ చిత్రాన్ని చూశారు. ఏది ఏమైనా సౌందర్య అందం, అభినయాన్ని తెలుగువారు ఎన్నటికీ మరచిపోలేరన్నది నిజం!