NTV Telugu Site icon

ఓటీటీలో రవిబాబు ‘క్రష్‌’! ఎప్పుడంటే…

ప్రముఖ దర్శక నిర్మాత రవిబాబు రాజీ పడలేదు! ఆయన లేటెస్ట్ మూవీ ‘క్రష్’ ఇటీవల సెన్సార్ కు వెళ్ళింది. అందులో అభ్యంతరకర సన్నివేశాలు బాగానే ఉండటంతో సెన్సార్ సభ్యులు మొత్తం తొమ్మిది కట్స్ ఇచ్చారని తెలిసింది. అయితే వాటిని కట్ చేస్తే సినిమా ఫ్లో దెబ్బతింటుందని భావించిన రవిబాబు… అందుకు అంగీకరించలేదట. దాంతో అంతా రవిబాబు రివైజింగ్ కమిటీకి వెళ్తాడేమో అనుకున్నారు. కానీ కథ ఇక్కడే ఓ కొత్త మలుపు తిరిగింది. రివైజింగ్ కమిటీ కి కాకుండా రవిబాబు ఓటీటీ బాట పట్టారు. ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలను సెన్సార్ చేయాల్సిన పనిలేదు. అక్కడైతే తన సినిమాను ఎలాంటి కట్స్ లేకుండానే వీక్షకులకు చూపించొచ్చు.

రవిబాబు కోరుకున్నది జీ 5 కు కలిసి వచ్చింది. ఈ అడల్ట్ కామెడీ మూవీ స్ట్రీమింగ్ రైట్స్ ను ఆ సంస్థ సొంతం చేసుకుంది. ఇప్పుడీ సినిమా జీ 5 లో జూలై 9వ తేదీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఫ్లయింగ్ ఫ్రాగ్స్ పతాకంపై రవిబాబు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమాలో అభయ్ సింహా, కృష్ణ బూరుగుల, చరణ్‌ సాయి, అంకిత మనోజ్, పాండే, శ్రీసుధా రెడ్డి కీలక పాత్రలు పోషించారు. అమెరికా వెళ్ళాలనుకునే ముగ్గురు కుర్రాళ్ళు లైంగిక అనుభవం ముఖ్యమని భావించి ఏం చేశారనే కాన్సెప్ట్ తో ఈ అడల్ట్ కామెడీ మూవీ తెరకెక్కినట్టు ఇప్పటికే విడుదలైన ట్రైలర్ చూస్తే అర్థమౌతోంది. హారర్, థ్రిల్లర్, కామెడీ జానర్స్ లో సినిమాలు తీసిన రవిబాబు… గతంలోనూ ఈ తరహా మూవీస్ కొన్ని తీశాడు కానీ… ఇప్పుడు మాత్రం పూర్తి స్థాయిలో అడల్ట్ కంటెంట్ నే నమ్ముకున్నాడని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.