Ram Charan: నా మూవీ కన్నా.. ‘ఇట్లు అర్జున’ బిగ్ హిట్ అవ్వాలి!

Ram Charan Aniesh

Ram Charan Aniesh

Ram Charan Hails Ittu Arjuna Hero Aniesh Acting: ‘ఇట్లు అర్జున’తో ప్రముఖ నిర్మాత, వ్యాపారవేత్త మహేష్ రెడ్డి కుమారుడు అనీష్ హీరోగా పరిచయమవుతున్న విషయం తెలిసిందే. మహేశ్‌ ఉప్పల దర్శకత్వం వహించగా.. వెంకీ కుడుముల నిర్మించారు. అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తుండగా.. అక్కినేని నాగార్జున ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. నవంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా సోమవారం రాత్రి హైదరాబాద్‌లో మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అక్కినేని అఖిల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చెర్రీ మాట్లాడుతూ.. అనీష్ నటనపై ప్రశంసలు కురిపించారు. తాను చెవిటి పాత్రలో చేసిన రంగస్థలం కన్నా, అనీష్‌ మూగవాడిగా చేసిన ఇట్లు అర్జున ఇంకా పెద్ద హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నా అన్నారు.

రామ్ చరణ్ మాట్లాడుతూ.. కొత్త ప్రతిభను ప్రోత్సహించడంలో కింగ్ నాగార్జున గారు ఎప్పుడూ ముందుంటారని ప్రశంసించారు. ‘నాగార్జున గారు ఈ సినిమాను సమర్పిస్తున్నారంటేనే చిత్రంపై నమ్మకం కలుగుతోంది. సినిమా విషయంలో ఎక్కడా తప్పు జరిగే అవకాశమే లేదు. నాగార్జున గారు కెరీర్ ఆరంభం నుంచి కొత్తవారికి అవకాశాలు ఇస్తున్నారు. ఇండస్ట్రీలో ఇంకెవరికీ ఆ దమ్ము, సత్తా లేదు. అనీష్ ఏడాది క్రితమే నాకు ఈ సినిమా గురించి చెప్పాడు. అందులోని కొన్ని సన్నివేశాలను కూడా చూపించాడు. నా తొలి సినిమా సమయంలో నేను ఎలా నటించానో గుర్తులేదు. కానీ అనీష్ మాత్రం నాకంటే పదిరెట్లు అద్భుతంగా నటించాడు. సినిమాలో అనీష్ మూగవాడి పాత్ర పోషిస్తున్నప్పటికీ.. తన నటనతో నవరసాలను అద్భుతంగా పలికించాడు. సినిమాలపై, నటనపై అతడికున్న ఆసక్తి, అంకితభావమే ఇంత గొప్పగా నటించడానికి కారణం’ అని చెర్రీ చెప్పారు.

అనీష్‌కు ఇట్లు అర్జున ఓ మైలురాయిగా నిలవాలని రామ్ చరణ్ ఆకాంక్షించారు. అతడు కచ్చితంగా చాలా కాలం పాటు చిత్ర పరిశ్రమలో కొనసాగుతాడనే నమ్మకం ఉందన్నారు. అంతేకాదు తాను చెవిటి వ్యక్తిగా నటించిన రంగస్థలం కంటే.. అనీష్ మూగవాడిగా నటించిన ఇట్లు అర్జున ఇంకా పెద్ద విజయాన్ని అందుకోవాలని చరణ్ కోరుకున్నారు. హీరోగా అనీష్‌కు ఇది తొలి సినిమానే అయినా.. కింగ్ నాగార్జున సమర్పణలో విడుదలవుతుండటంతో చిత్రంపై ఆసక్తి నెలకొంది. రామ్ చరణ్ ప్రశంసలు, మ్యూజికల్ కాన్సర్ట్‌తో సినిమా ప్రమోషన్లకు మరింత ఊపు వచ్చింది. నవంబర్ 13న విడుదల కానున్న ఇట్లు అర్జున ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.