దర్శకధీర ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించబోయే తదుపరి భారీ అడ్వెంచరస్ ప్రాజెక్ట్ ‘వారాణసి‘ గురించి సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. తాజాగా ఈ చిత్రం యొక్క కథ, కథనం మరియు ప్రమోషనల్ వీడియోపై రాజమౌళి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ సినిమా కథా నేపథ్యం ఏ రేంజ్‌లో ఉండబోతుందో వివరిస్తూ రాజమౌళి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. వారణాసి సినిమా ప్రయాణం వారణాసిలో ప్రారంభమై.. అక్కడి నుండి అంటార్కిటికా, ఆ తర్వాత ఆఫ్రికా ఖండం వరకు సాగుతుంది. అంతటితో ఆగకుండా కాలంలో వెనక్కి వెళ్తూ ప్రాచీన రోమ్ సామ్రాజ్యాన్ని తాకి.. చివరకు మళ్లీ తిరిగి వారణాసికి చేరుకుంటుంది.
సినిమా నుంచి విడుదల చేసిన ప్రమోషనల్ వీడియో గురించి స్పందిస్తూ.. మేము ఇప్పటికే ఒక టీజర్‌ను విడుదల చేశాం. కానీ అందులో కథను ఎక్కువగా రివీల్ చేయకూడదని అనుకున్నాను. ఎందుకంటే అంత పెద్ద కథను ఒక చిన్న టీజర్‌లో చూపించడం సినిమాకు న్యాయం చేయదు. అందుకే కథను బయటపెట్టకుండా ప్రేక్షకులు థియేటర్లలో ఎలాంటి అద్భుతమైన అనుభూతిని పొందబోతున్నారో తెలియజేసే విధంగా మాత్రమే ఆ వీడియోను రూపొందించాం’ అని తెలిపారు. రాజమౌళి మాటలను బట్టి ఈ చిత్రం కేవలం ఒక ప్రాంతానికో లేదా దేశానికో పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్త పర్యటన, విజువల్స్ మరియు చారిత్రక అంశాలతో కూడిన భారీ అడ్వెంచర్‌గా ఉండబోతుందని స్పష్టమవుతోంది. రాజమౌళి విజన్, కథను నడిపించే తీరుపై అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 2027 ఏప్రిల్ 7న జక్కన్న ఎలాంటి విధ్వంసం చేస్తాడో చూడాలి

