NTV Telugu Site icon

‘పంచతంత్రం’లో సుభాష్‌గా రాహుల్ విజయ్!

Rahul Vijay Role Revealed from Panchathanthram Movie on His Bday

ప్ర‌ముఖ స్టంట్ కొరియోగ్రాఫ‌ర్ విజ‌య్ త‌న‌యుడు రాహుల్ 2018లో ఈ మాయ పేరేమిటో సినిమాతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ త‌ర్వాత సంవ‌త్స‌రం నిహారిక‌తో క‌లిసి సూర్య‌కాంతంలో న‌టించిన రాహుల్ విజ‌య్ గ‌త యేడాది కాలేజ్ కుమార్లో టైటిల్ రోల్ పోషించాడు. ఇప్పుడు హ‌ర్ష పులిపాక ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న పంచ‌తంత్రంలో రాహుల్ హీరోగా న‌టిస్తున్నాడు. జూన్ 7 రాహుల్ విజ‌య్ పుట్టిన రోజు సంద‌ర్భంగా అత‌నికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ను నిర్మాత‌లు అఖిలేష్ వ‌ర్థ‌న్, సృజన్ ఎర‌బోలు విడుద‌ల చేశారు. శివాత్మిక రాజ‌శేఖ‌ర్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీలో బ్ర‌హ్మానందం, సముతిర ఖ‌ని, స్వాతిరెడ్డి, న‌రేశ్ అగ‌స్థ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు.
‘పంచతంత్రం’తో రచయితగా, దర్శకుడిగా పరిచయమవుతున్న హర్ష పులిపాక మాట్లాడుతూ “పెళ్లి, కాబోయే జీవిత భాగస్వామి ఎలా ఉండాలనే విషయాల్లో కచ్చితమైన భావాలు ఉన్న 28 సంవత్సరాల యువకుడు సుభాష్ పాత్రలో రాహుల్ విజయ్ కనిపిస్తారు. ఈతరం యువతకు పెళ్లి, జీవితాంతం కొనసాగే బంధాలు, బాధ్యతలు వంటి విషయాల్లో ఉండే కన్‌ఫ్యూజన్‌ను, క్లారిటీని చూపించే పాత్ర. సింపుల్ అండ్ రొమాంటిక్ క్యారెక్టర్ అని చెప్పవచ్చు” అని చెప్పారు.
ఈ సందర్భంగా నిర్మాత సృజన్‌ ఎరబోలు, అఖిలేష్ వర్ధన్ మాట్లాడుతూ “రాహుల్ విజయ్ కు మా ‘పంచతంత్రం’ చిత్రబృందం తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు. సుభాష్ పాత్రలో అతను కనిపిస్తాడు. అతడిలో ఇప్పటి యువత తమను తాము చూసుకుంటారు. నేటి యువతరానికి ప్రతినిధి లాంటి సుభాష్ పాత్రలో రాహుల్ విజయ్ సహజంగా నటిస్తున్నారు. ఇప్పటివరకు విడుదల చేసిన ఫస్ట్ లుక్స్ కు సూపర్ రెస్పాన్స్ లభించింది. జూలైలో లాస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాం. అటు ఇటుగా పది రోజులు షూటింగ్ చేస్తే సినిమా కంప్లీట్ అవుతుంది. లాక్‌డౌన్‌లో ప్రోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ప్రారంభించాం” అని అన్నారు.