ఇటీవల పూణేలో జరిగిన ‘సియా – కేతన్ అగర్వాల్’ ఘోరమైన ఇన్సిడెంట్‌ను ప్రస్తావిస్తూ.. ఒక ఎక్స్ (ట్విట్టర్) యూజర్ రాహుల్ రవీంద్రన్‌ను ట్యాగ్ చేస్తూ ఒక ఆసక్తికరమైన రిక్వెస్ట్ పెట్టాడు. “బ్రో, పూణేలో జరిగిన తాజా ఘోరాన్ని చూసైనా సరే.. పురుషులపై మహిళలు చేసే అరాచకాలు, దారుణాల (Atrocities of women on men) నేపథ్యంలో ఒక సినిమా తీయండి ప్లీజ్” అని కోరాడు. నెటిజన్ ప్రశ్నకు రాహుల్ స్పందిస్తూ.. “బ్రో, నాకు అన్నీ తెలుసని నేను అనను.. నేనేమైనా తప్పుగా మాట్లాడితే నన్ను ఎడ్యుకేట్ చేయి. కానీ, సమాజంలో ‘మహిళలు’ పురుషులపై దారుణాలు చేయడం అనేది నేనెక్కడా చూడలేదు. కొంతమంది సైకో లేదా సోషియోపతిక్ మనస్తత్వం ఉన్న మనుషులు ఘోరమైన నేరాలకు పాల్పడుతుంటారు, దురదృష్టవశాత్తూ వారు స్త్రీలు కావచ్చు. అంతే తప్ప దాన్ని మహిళలంతా పురుషులపై చేస్తున్న దారుణంగా చూడలేం” అని స్పష్టం చేశారు.
మరోవైపు సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న అసలు సిసలు సమస్యను రాహుల్ ఎండగట్టారు. “మనం బతుకుతున్న ఈ సమాజంలో శతాబ్దాలుగా ఒక వ్యవస్థ నడుస్తోంది. అది ప్రతిరోజూ, అదృశ్యంగా మహిళల ఉనికిని, వారి గుర్తింపును నలిపేస్తూ.. వారిని చిన్నబోయేలా చేస్తోంది. ఈ ప్రపంచం మహిళలకు సమానమైన అవకాశాలను ఇవ్వడం లేదు. నా చుట్టుపక్కల ఎంతోమంది మహిళలు ఈ అదృశ్య ఒత్తిడి వల్ల నిశ్శబ్దంగా నరకం అనుభవించడం నేను కళ్లారా చూశాను. అందుకే ఒక పురుషుడిగా, ఈ పవర్ ఈక్వేషన్ వల్ల నేను లబ్ధి పొందుతున్నాను కాబట్టి.. బాధ్యతగా భావించి ‘ది గర్ల్ ఫ్రెండ్’ కథ ద్వారా ఆ పాయింట్‌ను చూపించాలనుకున్నాను.” అని రాహుల్ రవీంద్రన్ చెప్పుకొచ్చారు.
పూణే కేసు గురించి మాట్లాడుతూ.. తాను ఇంకా ఆ కేసు పూర్తి వివరాలు చదవలేదని, ఒకవేళ ఆ కథ ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తే భవిష్యత్తులో దానిపై కూడా సినిమా తీస్తానని రాహుల్ అన్నారు. కానీ, అది ఒక నిర్దిష్ట మహిళ చేసిన నేరంగానే చూపిస్తా తప్ప.. ‘పురుషులపై మహిళల దారుణాలు’ అనే కోణంలో సినిమా తీయనని, ఈ రెండింటికీ చాలా తేడా ఉందని క్లారిటీ ఇచ్చారు. “మా సినిమాలో విక్రమ్ అనే పాత్ర హంతకుడు కాదు, రేపిస్ట్ అంతకంటే కాదు. అక్కడ ఎలాంటి శారీరక వేధింపులు లేవు. నిజానికి అతను తన గర్ల్ ఫ్రెండ్‌కు ఎంతో నమ్మకంగా ఉంటాడు. అయినప్పటికీ ఒరిజినల్ ట్వీట్ చేసిన వ్యక్తి లాంటి ఒక వర్గం వారు ఈ సినిమా కంటెంట్ చూసి ఎందుకు అంతలా ట్రిగర్ అవుతున్నారో ఒకసారి తమని తాము ప్రశ్నించుకోవాలి” అని రాహుల్ ఇండైరెక్ట్ చురకలు అంటించారు.

