సల్మాన్ ఖాన్, ప్రభుదేవా అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే సినిమా వాంటెడ్. తెలుగులో పోకిరీకి ఇది రీమేక్. సల్లూభాయ్ కు సెకండ్ ఇన్నింగ్స్ లో బోలెడంత బూస్టప్ ఇచ్చిన సినిమా. ప్రభుదేవాకూ హిందీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చిపెట్టింది ఈ సినిమానే. సో… వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ అంటే… అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పైగా సల్మాన్ ఖాన్ కు ఈద్ కూ ఉన్న అనుబంధం కూడా అందరికీ తెలిసిందే. ఆ పండగ సీజన్ లో సల్మాన్ ఖాన్ సినిమా రాకపోతే… బాలీవుడ్ ప్రేక్షకులకు ఏదో తెలియని వెలితి ఉంటుంది. కరోనా సమయంలో ఎన్నో కల్లోలాను ఎదుర్కొని, సల్మాన్ తన రాధే చిత్రాన్ని ఈ యేడాది ఈద్ కు విడుదల చేశాడు. కొరియన్ మూవీ ది అవుట్ లాస్ కు రీమేక్ అయిన రాధే ఎలా ఉందో చూద్దాం.
ఢిల్లీ నుండి ముంబై నగరానికి వచ్చి, అక్కడ పాగా వేయడానికి ప్రయత్నిస్తుంటాడు డ్రగ్ మాఫియా డాన్ రాణా (రణదీప్ హూడా). అతని కారణంగా చిన్నపిల్లలు సైతం డ్రగ్స్ కు అలవాటు పడి ప్రాణాలు కోల్పోతుంటారు. ఈ నరరూప రాక్షకుడిని కంట్రోల్ చేయడం సామాన్య పోలీసుల వల్ల కాకపోవడంతో చివరకు స్పెషల్ బ్రాంచ్ కు చెందిన రాథే (సల్మాన్ ఖాన్) ను రంగంలోకి దించుతారు. అలాంటి ఓ పోలీస్ ఆఫీసర్ ఎలాంటి పనులు చేసి అటు విలన్స్ ఆట కట్టించి, ఇటు ఆడియెన్స్ ను ఎలా మెప్పిస్తాడో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పటికే సవాలక్ష సినిమాలలో మనం చూసేశాం. అదే రాథేలోనూ చూస్తాం. మరి ఈ సినిమా గొప్పతనం ఏమిటీ అంటే… ఏమీ చెప్పలేం. అవే రొటీన్ ఫైట్స్, రొటీన్ సాంగ్స్. కాకపోతే… ఆ పాటలు ఫైట్స్ చేసేది కండల వీరుడు సల్మాన్ ఖాన్. గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడమే కాదు, ఎప్పటి లానే తన అభిమానులను షర్ట్ తీసి, కండలు చూపించి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అతని ప్రియరాలు దిశా పటానీ సైతం నిర్మాతల బడ్జెట్ ను వీలైనంత తగ్గించే ప్రయత్నంలో భాగంగా కురచ దుస్తులు వేసుకుని, కుర్రకారును ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఈ సినిమాలో మరో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి జాకీ ష్రాఫ్. ఏసీపీ అవినాశ్… దియా బ్రదర్ గా నటించాడు. నిజజీవితంలో దిశా పటాని బోయ్ ఫ్రెండ్ టైగర్ ష్రాఫ్ ను తండ్రి అయిన జాకీ ష్రాఫ్ ఇక్కడ మాత్రం మావగారిగా కాకుండా అన్నయ్య పాత్ర చేయడం విశేషం. ఇక తెలుగు నటుడు నర్రా శ్రీనివాస్, తమిళ హీరో భరత్, మేఘా ఆకాశ్ లకూ ఈ హిందీ చిత్రంలో అవకాశం చిక్కింది. కానీ, పెద్దంత ఆకట్టుకునే పాత్రలేవీ కావు వారివి.
ఏతావాతా రాథే సినిమా చూడటం వల్ల ఏం ఒరిగిందంటే… చెప్పడానికి ఏమీ ఉండదు. నిజానికి ఇలాంటి మాస్ ఫైట్స్, డాన్స్ నంబర్స్ ఉన్న సినిమాలు ఓటీటీలో విడుదల కావడం వల్ల ఉపయోగం ఉండదు. కొన్ని సినిమాలు థియేటర్లలోనే విడుదల కావాలి. దాని వల్ల సక్సెస్ అవుతాయా అంటే చెప్పలేం కానీ… కనీసం అభిమానులు విజిల్స్ వేయడానికి, చప్పట్లు చరచడానికి ఆస్కారం ఉంటుంది… ఏదో ఒక స్థాయిలో. కానీ ఇలా ఓటీటీలో విడుదలైతే చప్పగానూ, చాలా చికాకుగానూ అనిపిస్తుంది. సరే… విదేశాల్లో ఈ చిత్రాన్ని థియేటరల్లోనే విడుదల చేశారు. అక్కడ ఇక్కడి మాదిరి వీరాభిమానులు ఉండరు కాబట్టి… ఇదే స్పందన లభిస్తోంది.
చిత్రం ఏమంటే… రాథే సినిమాను జీఫ్లెక్స్ లో ఐదు వందల రూపాయలు చెల్లించి చూడొచ్చనగానే… లక్షలాది మంది ఒకేసారి చూడటానికి ప్రయత్నించడంతో సర్వర్ క్రాష్ అయ్యే పరిస్థితి ఏర్పడిందట. బాధాకరం ఏమంటే… అలా ఎన్నో ఆశలతో డబ్బులు చెల్లించి మరీ ఈ సినిమాను చూసిన తర్వాత నచ్చకపోతే… వచ్చే రియాక్షన్ సైతం అలానే ఉంటుంది కదా! దాంతో ఇప్పుడు రాథేని బహిష్కరించమంటూ హ్యాష్ ట్యాగ్ తో బాలీవుడ్ ప్రేక్షకులు సోషల్ మీడియాలో హంగామా సృష్టిస్తున్నారు. పైగా బ్యాడ్ రేటింగ్ వచ్చిన సల్మాన్ ఖాన్ సినిమా గానూ రాథే కొత్త రికార్డ్ సృష్టించిందన్నది మరో తాజా వార్త.
ఇలాంటి సినిమాలో నటీనటుల గురించి, సాంకేతిక నిపుణుల గొప్పతనం గురించి ఇక చెప్పుకోవడానికి ఏముంటుంది!? దక్షిణాది నటులు కొందరు మెరియడం ఓ ఆనందం, అలానే దేవిశ్రీ ప్రసాద్ దువ్వాడ జగన్నాథమ్ కోసం స్వరపరిచిన పాటను తీసుకోవడం ఓ సంతోషం. ఇదిలా ఉంటే ప్రభుదేవా దర్శకుడిగా ఎందుకో తన సత్తాను చాటలేకపోతున్నాడు. అతను డైరెక్ట్ చేస్తున్న చిత్రాలు వరస పరాజయం పాలు అవుతున్నాయి. కనీసం సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరో అవకాశం ఇచ్చినప్పుడైనా ఓ మంచి కథను ఎంపిక చేసుకుని మూవీ చేసి ఉండాల్సింది. కానీ చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఉపయోగం లేదు. సో… ఈ సూపర్ కొరియోగ్రాఫర్ ఇక మీదట మెగా ఫోన్ పక్కన పెట్టేసి, నటుడిగా కొనసాగితేనే బెటరేమో!! సామాన్య సినిమా జనం సంగతి ఏమో కానీ… రాథే సల్మాన్ అభిమానులకు కూడా నచ్చే చిత్రం అనుకోలేం.
రేటింగ్: 1.5 / 5
ప్లస్ పాయింట్స్
చెప్పడానికి ఏమీ లేవు
మైనస్ పాయింట్స్
పెద్ద జాబితా అవుతుంది
టాగ్ లైన్
రాథే… నమ్మరాదే!!
