ఎవరో ఒకరు ధైర్యం చేసి ముందడుగు వేస్తేనే మిగిలిన వాళ్ళు అనుసరిస్తారు. ఇప్పుడు అదే పని బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ చేస్తున్నాడు. సినిమాను ఓటీటీ, థియేటర్ గా విభజించి చూడకుండా… రెండుచోట్లా ఒకేసారి విడుదల చేయడం ఇప్పుడున్న పరిస్థితుల్లో కరెక్ట్ అని సల్మాన్ నమ్ముతున్నాడు. నిజానికి కొన్ని సంవత్సరాల క్రితమే హాలీవుడ్… సినిమా థియేట్రికల్ రిలీజ్ రోజునే డీవీడీని విడుదల చేయడమనే సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. కానీ ఇలా చేయడం వల్ల థియేటర్లలో కలెక్షన్లు తగ్గిపోతాయని, ఆ వ్యవస్థకే ముప్పు వాటిల్లుతుందని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో అది ఇండియాలో అమలు కాలేదు. కానీ పైరసీని ఎదుర్కోవడానికి ఇదే సరైన మార్గమని కొందరు చెబుతూనే ఉన్నారు. థియేటర్లలో కాకుండా తన సినిమాను నేరుగా కేబుల్ ద్వారా ప్రసారం చేయాలని ప్రయత్నించి కమల్ హాసన్ విఫలమయ్యారు. కానీ రోజులన్నీ ఒకేలా ఉండవు. మారుతున్న సమయానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ మారాల్సిందే! కరోనా సమయంలో ఇది బాగా కనిపించింది. థియేటర్లలోనే వస్తామని మడికట్టుకుని కూర్చున్న చాలామంది నిర్మాతలు ఆ తర్వాత మనసు మార్చుకుని ఓటీటీలో తమ చిత్రాలను విడుదల చేశారు. మరి కొందరైతే ముందు ఓటీటీలో ఆ తర్వాత థియేటర్లలో సినిమాలను రిలీజ్ చేశారు. చిత్రం ఏమంటే జనవరి నుండి ధియేట్రికల్ రిలీజ్ అయిన సినిమాలు వెను వెంటనే ఇప్పుడు ఓటీటీలో ప్రత్యక్షమౌతున్నాయి. ఇక సల్మాన్ ఖాన్ అయితే… ఒకేసారి రెండు చోట్ల ఎందుకు ప్రదర్శించకూడదనే నిర్ణయానికి వచ్చారు. తన తాజా చిత్రం ‘రాధే’ను ఆయన మే 13న ఇటు థియేటర్లలోనూ అటు పే ఫర్ వ్యూ పద్థతిలో జీ ప్లెక్స్ లోనూ విడుదల చేస్తున్నారు. థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ కోరుకునే వారు అక్కడకు వెళ్తారు. కరోనా కారణంగా రిస్క్ చేయడం ఎందుకని భావించేవారు, ఇంట్లో ఉండే ‘రాధే’ను చూస్తారు. కానీ ఒకరి కోసం మరొకరు కొంతకాలం వేచి ఉండాల్సిన అవసరం లేదు. రాబోయే రోజుల్లో అగ్ర కథానాయకులంతా ఇదే బాట పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. పక్కా కమర్షియల్ అంశాలతో ప్రభుదేవా తెరకెక్కించిన ‘రాధే’కు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం… మన స్టార్ హీరోలూ అదే దారిలో ప్రయాణిస్తారనేది ఖాయం.
సల్మాన్ ఖాన్ కొత్త మార్గం చూపాడా!?
