Puri Jagannadh: “ఫిజిక్స్ ముందు సెల్ఫ్ కంట్రోల్ నేర్పండి”..స్కూళ్లపై పూరి జగన్నాథ్ ఫైర్..

Puri Jagannadh

Puri Jagannadh

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) ప్రస్తుతం తన సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సమాజంలో మారాల్సిన పద్ధతులపై ‘పూరి మ్యూజింగ్స్’ (Puri Musings) ద్వారా నిరంతరం గొంతు విప్పుతూనే ఉన్నారు. ఇటీవల పెళ్లి, దేవుళ్లపై ఆయన చేసిన పాత కామెంట్స్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అయితే, వాటన్నింటినీ పక్కన పెట్టి.. ప్రస్తుత విద్యావ్యవస్థలోని లోపాలను ఎండగడుతూ ‘ఫ్యూచర్‌ ఎడ్యుకేషన్‌’ (Future Education) అనే సరికొత్త ప్రాక్టికల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో పూరి ముందుకు వచ్చారు.

నేటి కార్పొరేట్ స్కూళ్లన్నీ కేవలం ర్యాంకులు, మార్కులు, పిల్లలతో పుస్తకాలు బట్టీ పట్టించడం (కంఠస్థం) పైనే శ్రద్ధ పెడుతున్నాయని పూరి జగన్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఏసీ రూముల్లో కూర్చోబెట్టి అపారమైన పుస్తక జ్ఞానాన్ని అందిస్తే సరిపోదని, అది వారిని మానసికంగా బలమైన వ్యక్తులుగా మార్చలేదని పూరి స్పష్టం చేశారు. భవిష్యత్తు తరాలు బాగుండాలంటే ఎల్‌కేజీ (LKG) నుంచే పాఠ్యాంశాల్లో విప్లవాత్మక మార్పులు రావాలని ఆయన డిమాండ్ చేశారు.. ‘పిల్లలకు సొంతంగా ఇంటి పనులు ఎలా చేసుకోవాలన్నది ఎల్‌కేజీ నుంచే నేర్పాలి. వ్యక్తిగత శుభ్రత గురించి చెప్పాలి. స్కూళ్లలోనే ప్రతి విద్యార్థికి ‘కుకింగ్ క్లాసెస్’ (వంట నేర్పడం) తప్పనిసరి చేయాలి. అప్పుడే వారు భవిష్యత్తులో ఎక్కడికి వెళ్లినా ఒంటరిగా బతకగలరు’ అని తెలిపాడు. అంతే కాదు..

‘స్కూళ్లలో ఫిజిక్స్, కెమిస్ట్రీ పాఠాల కంటే ముందు.. సెల్ఫ్ కంట్రోల్ (స్వయం నియంత్రణ), టైమ్ మేనేజ్‌మెంట్ (సమయపాలన), ఎమోషనల్ బ్యాలెన్స్ (భావోద్వేగ సమతుల్యత) లాంటి వాటిపై ప్రత్యేక పాఠాలుండాలి. ఎందుకంటే జీవితంలో వచ్చే కష్టాలను తట్టుకోవడానికి ఇవే ఉపయోగపడతాయి. ఇప్పుడున్న స్మార్ట్‌ఫోన్ యుగంలో పిల్లలకు ‘డిజిటల్ డిసిప్లిన్’ (గ్యాడ్జెట్స్‌ను ఎలా వాడాలి) అనేది ఖచ్చితంగా నేర్పాలి. అలాగే వారి మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ‘మెంటల్ హెల్త్’ పై అవగాహన కలిగించే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ స్కూళ్లలోనే నిర్వహించాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగడం కోసం ప్రతి విద్యార్థి కనీసం మూడు భాషలు అనర్గళంగా మాట్లాడేలా తయారు చేయాలి. వీటన్నింటికంటే ముఖ్యంగా ప్రకృతిని, పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలనేది చిన్నతనం నుంచే నూరిపోయాలి’ అని కుండ బద్దలు కొట్టినట్లుగా తెలిపాడు. ఈ టాపిక్‌తో పూరి నెటిజన్ల మనసులు గెలుచుకున్నారు. ప్రస్తుతం విద్యార్థులు ర్యాంకుల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న తరుణంలో.. పూరి చెప్పినట్లు ‘ఎమోషనల్ బ్యాలెన్స్’, ‘లైఫ్ స్కిల్స్’ నేర్పడం చాలా అవసరమని విద్యావేత్తలు సైతం అభిప్రాయపడుతున్నారు.