NTV Telugu Site icon

అచ్చి వచ్చిన రోజున దర్శకేంద్రుని చిత్ర గీతం!

Premantey Enti Song Announcement from Pelli Sandadi

ఏప్రిల్‌28! ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు జీవితంలో విశిష్ట‌మైన రోజు. ఎందుకంటే ఏప్రిల్‌28 క‌మ‌ర్షియ‌ల్ సినిమాకి కొత్త భాష్యం చెప్పి బాక్సాఫీస్‌లో స‌రికొత్త చ‌రిత్ర సృష్టించిన, కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌కత్వం వ‌హించిన అడివిరాముడు రిలీజైన రోజు. అదే ఏప్రిల్‌ 28 ప్ర‌పంచ చ‌ల‌న చిత్ర‌ చరిత్ర‌లో సంచ‌ల‌నం సృష్టించి బాక్సాఫీస్ రికార్డుల‌కు కొత్త అర్ధం చెప్పిన కె. రాఘ‌వేంద్ర‌రావు స‌మ‌ర్ప‌ణ‌లో ఆయన శిష్యుడు ఎస్‌.ఎస్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన బాహుబ‌లి 2 విడుద‌లైన రోజు. అంతేకాదు… అదే తేదిన రాఘవేంద్రరావు తండ్రి కె.ఎస్. ప్రకాశరావు డైరెక్ట్ చేసిన ‘సెక్రటరీ’ మూవీ సైతం విడుదలైంది. ఆ రకంగా ఇది రాఘవేంద్రరావుకు మెమొరబుల్ డేట్. అలానే ఆయన కెరీర్ లో మ్యూజికల్ హిట్ గా నిలిచిన ‘పెళ్ళిసందడి’ విడుదలై ఇప్పటికీ పాతికేళ్ళు గడిచింది. ఈ సందర్భంగా రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ఈ తరం, కొత్త జంటతో ‘పెళ్ళి సందడి’ మరోమారు తెరకెక్కుతోంది. అయితే… ఇది ఆ సినిమాకు సీక్వెల్ కాదు, ఆ కథ అస్సలు కాదు. ఇది ఈ తరం ప్రేమకథ, పెళ్ళి కథ. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి స్వరవాణి కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. ఈ మూవీలోని తొలి గీతం ఏప్రిల్ 28వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల కాబోతోంది. గౌరీ రోనంకి దర్శకత్వంలో అర్కా మీడియా వర్క్, ఆర్.కె. ఫిల్మ్ అసోసియేట్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి.