మంచు కుటుంబ వివాదం గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ కుటుంబ వివాదం సమసింది అనుకునే సమయంలోపే ఒక మీడియా ప్రతినిధి మీద మోహన్ బాబు దాడి చేయడం కలకలం రేపింది. ఆ మీడియా ప్రతినిధికి తీవ్ర గాయాలు కావడం, ముఖానికి సర్జరీ చేయాల్సి రావడంతో పోలీసులు అంతకుముందు నమోదు చేసిన సెక్షన్లను మార్చి హత్యాయత్నం కేసు కింద నమోదు చేశారు. దీంతో మోహన్ బాబు హైకోర్టుకు వెళ్లి ఈరోజు వరకు అరెస్టు చేయకూడదు అంటూ ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు అయితే ఇప్పటికీ ఆయన అందుబాటులోకి రాకపోవడంతో ఆయన పరారీలోకి, అజ్ఞాతంలోకి వెళ్లారంటూ పోలీసులు భావిస్తున్నారు.
ఆంధ్ర, తెలంగాణ సహా తమిళనాడులో ఆయన గురించి ప్రస్తుతం సోదిస్తున్నారు పోలీసులు. మోహన్ బాబాయ్ కోసం సుమారు ఐదు బృందాలు రంగంలోకి దిగాయి. మోహన్ బాబుని అదుపులోకి తీసుకుని బైండోవర్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్నటి నుంచి పోలీసులు మోహన్ బాబుని సంప్రదించేందుకు ప్రయత్నిస్తుంటే ఆయన అందుబాటులోకి రాలేదు. దీంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లుగా భావిస్తున్నారు పోలీసులు. అయితే మీడియా ప్రతినిధి మీద దాడి అంశం మీద ఇప్పటికే మోహన్ బాబు ఒక ఆడియో రిలీజ్ చేశారు. అంతేకాకుండా సదరు మీడియా సంస్థను ఉద్దేశిస్తూ ఒక లేఖ సైతం రిలీజ్ చేశారు. మీడియా ఇలా వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడకూడదు అంటూ కూడా ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.