Police Complaint: సూపర్ స్టార్ కృష్ణకు ఘన నివాళి.. ‘పోలీస్ కంప్లైంట్’ మూవీ నుంచి స్పెషల్ సాంగ్ రిలీజ్!

Tollywood (3)

Tollywood (3)

Police Complaint: విలక్షణ నటనతో మెప్పించే వరలక్ష్మి శరత్‌కుమార్, వెర్సటైల్ హీరో నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’. ‘చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ’ అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో, హారర్-యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమా మే 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన నటుడు కృష్ణసాయి పుట్టినరోజు సందర్భంగా.. చిత్ర యూనిట్ ఒక ప్రత్యేక సర్ప్రైజ్ ఇచ్చింది. సూపర్ స్టార్ కృష్ణపై రూపొందించిన ఒక స్పెషల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. కృష్ణసాయి తన అభిమాన నటుడైన కృష్ణకు ఈ పాట ద్వారా ఘనమైన నివాళి అర్పించారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో ‘అఘోర’, ‘రాఘవరెడ్డి’, ‘ఆదిపర్వం’ వంటి వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించిన సంజీవ్ మేగోటి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్రల కాంబినేషన్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఇదొక అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అయినప్పటికీ, ఇందులో హారర్ థ్రిల్లర్ అంశాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయి. 52 మంది సీనియర్ ఆర్టిస్టులతో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించాం” అని తెలిపారు. ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో రాగిణి ద్వివేది, ఆదిత్య ఓం, రవిశంకర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మే 22న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.