NTV Telugu Site icon

వివేక్ మృతికి మోడీ సంతాపం

PM Narendra Modi condoles death of actor Vivekh

ప్రముఖ తమిళ నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత వివేక్ ఈ రోజు గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మరణవార్తతో సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యింది. ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వివేక్ ఆకస్మిక మృతి బాధాకరం అంటూ ట్వీట్ చేశారు. ఈ మేరకు మోడీ “ప్రముఖ నటుడు వివేక్ అకాల మరణం చాలా మందిని బాధపెట్టింది. అతని కామెడీ టైమింగ్, ఇంటెలిజెంట్ డైలాగులు ప్రజలను అలరించాయి. అతని సినిమాల్లో, నిజ జీవితంలో పర్యావరణం, సమాజం పట్ల ఆయన స్పెషల్ గా కన్సర్న్ తీసుకునేవారు. ఆయన కుటుంబానికి, స్నేహితులకు, అభిమానులకు సంతాపం. ఓం శాంతి” అంటూ ట్వీట్ చేశారు మోడీ.

వివేక్ వయసు 59 సంవత్సరాలు. నిన్న గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన వివేక్ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. ఈరోజు తెల్లవారుజామున 4.35 గంటలకు వివేక్ మృతి చెందినట్టు డాక్టర్లు వెల్లడించారు. అయితే కోవిడ్ టీకా తీసుకున్న 24 గంటల్లోనే ఆయన గుండెపోటుతో మరణించడంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే కోవిడ్ టికాకు, ఆయనకు గుండెపోటు రావడానికి ఎలాంటి సంబంధం లేదని డాక్టర్లు వెల్లడించారు.

కె బాలచందర్ దర్శకత్వం వహించిన ‘మనదిల్ ఉరుది వేండం’ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన వివేక్ దాదాపుగా 300లకు పైగా చిత్రాల్లో నటించారు. కోలీవుడ్ స్టార్ హీరోలందరితో కలిసి నటించిన వివేక్ రజినీకాంత్ ‘శివాజీ’, సూర్య ‘సింగం’ తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. వివేక్‌ను ‘చిన్న కలైవనార్’ అంటారు. 2009 లో ఆయనకు పద్మశ్రీ అవార్డు లభించింది. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వివేక్ తల్లి, కుమారుడు అనారోగ్యంతో మరణించడంతో బాగా కృంగిపోయిన ఆయన అప్పటి నుంచి సినిమాలు చేయడం తగ్గించారు.