NTV Telugu Site icon

Kalaahi Media: ‘సైమా 2024’లో ‘పిండం’.. మరో సినిమా అనౌన్స్ చేసిన నిర్మాత

Pindam Producer

Pindam Producer

Pindam producer Yeshwanth Daggumati’s Kalaahi Media earns a nomination in SIIMA 2024: శ్రీరామ్, ఖుషీ రవి జంటగా సాయికిరణ్ దైద దర్శకత్వంలో రూపొందిన హారర్ థ్రిల్లర్ చిత్రం ‘పిండం’ గత సంవత్సరం విడుదలయింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించడమే కాకుండా, ఓటీటీ ద్వారా వివిధ భాషల ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాతో దర్శకుడు సాయికిరణ్ దైదతో పాటు కళాహి మీడియా వ్యవస్థాపకుడు యశ్వంత్ దగ్గుమాటి నిర్మాతగా సినీ రంగ ప్రవేశం చేశారు. విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు, వాణిజ్య పరంగా మంచి విజయం సాధించిన ‘పిండం’ సినిమా ఇప్పుడు అవార్డుల విషయంలో కూడా సత్తా చాటుతోంది. తాజాగా ప్రతిష్టాత్మక అవార్డు వేడుక ‘సైమా 2024’లో ఉత్తమ తొలి చిత్ర నిర్మాత విభాగంలో నామినేషన్ పొందింది. కమర్షియల్ అంశాలకు దూరంగా, మొదటి సినిమాతోనే ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించాలనే తపనతో, ‘పిండం’ వంటి వైవిధ్యమైన చిత్రంతో నిర్మాతగా పరిచయమయ్యారు యశ్వంత్ దగ్గుమాటి. సినిమా పట్ల ఆయనకున్న ఈ తపనే ప్రతిష్టాత్మక అవార్డు వేడుకలో నామినేషన్ పొందేలా చేసింది.

Cinema Cess: సినీ టికెట్లు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లపై మోత?

ఈ వార్త చిత్ర బృందంలో ఎంతో ఆనందాన్ని నింపింది. ఈ అవార్డును గెలుచుకుంటామని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాత యశ్వంత్ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని సినిమా విడుదలకు ముందు బిజినెస్ ను పూర్తి చేయడమే కాకుండా, థియేటర్‌లలో ఎక్కువ కాలం చిత్ర ప్రదర్శన ఉండేలా చూసుకున్నారు. యశ్వంత్ అమెరికాలోని కార్పొరేట్ రంగంలో ఎంతో పేరు తెచ్చుకున్నారు. అక్కడే దర్శకుడు సాయికిరణ్‌ను కలిసిన యశ్వంత్, ఆయనలోని ప్రతిభను గుర్తించి ‘పిండం’ సినిమాతో నిర్మాతగా మారారు. సైమా నామినేషన్ అనేది ‘పిండం’ చిత్ర బృందానికి ఖచ్చితంగా సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది అనడంలో సందేహం లేదు. ఈ వేడుకలో సినిమా సందడి చేయడానికి ముందే, ‘పిండం’ దర్శకుడు సాయికిరణ్‌తో మరో కొత్త సినిమా కోసం చేతులు కలుపుతున్నట్లు కళాహి మీడియా ప్రకటించింది. ఈ చిత్రాన్ని 2024 చివరి నాటికి సెట్స్‌ పైకి తీసుకెళ్ళాలని భావిస్తున్నారు. కథ ఇప్పటికే లాక్ చేయబడిందని, నటీనటులు, సాంకేతిక నిపుణులు మరియు ఇతర వివరాలకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుందని తెలుస్తోంది.