సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ మూవీకి సంబంధించిన కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. దర్శకుడు బుచ్చిబాబు సానా అధికారికంగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను కన్ఫర్మ్ చేశారు. అందరూ ఊహించినట్టుగానే.. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న పెద్ది చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. విషయం తెలిసిన మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా పెద్ది సినిమాను మర్చి 27న రిలీజ్ చేయాలని ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ విషయాన్ని ఈరోజే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. కాసేపటికే పెద్ది డైరెక్టర్ సినిమా విడుదల తేదీని తన ఎక్స్ ఖాతాలో ప్రకటించారు. ఉస్తాద్, పెద్ది మధ్య నెల రోజుల గ్యాప్ ఉంది. చివరకు రెండు సినిమాల రిలీజ్‌పై కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. నెల రోజుల్లోనే రెండు సినిమాలు విడుదల అవుతుండడంతో మెగా ఫాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సోషల్ మీడియా మొత్తం ఉస్తాద్ భగత్ సింగ్, పెద్ది, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ పేర్లు ట్రెండ్ అవుతున్నాయి. మొత్తానికి బాబాయ్ పవన్ కోసం అబ్బాయ్ చరణ్ కాస్త వెనక్కి తగ్గాడు.
పెద్ది మూవీ మొదటి నుంచే ఇండస్ట్రీలో స్పెషల్ బజ్‌ను క్రియేట్ చేస్తోంది. దర్శకుడు బుచ్చిబాబు సానా గతంలో చూపించిన ఎమోషనల్ డెప్త్, పవర్‌ఫుల్ కథన శైలి కారణంగా ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు రిలీజ్ డేట్ అధికారికంగా ఫిక్స్ కావడంతో అభిమానుల్లో హైప్ మరింత పెరిగింది. ఏప్రిల్ చివరి వారం కావడంతో ఈ సినిమాకు సమ్మర్ హాలిడేస్ అడ్వాంటేజ్ కూడా దక్కనుంది. ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు యూత్‌ను కూడా ఆకట్టుకునేలా పెద్ది తెరకెక్కుతోందనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని గ్రాండ్ స్కేల్‌లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని సమాచారం. ఇప్పటికే షూటింగ్, ప్రొడక్షన్ విషయంలో పక్కా ప్లానింగ్‌తో ముందుకెళ్తున్న పెద్ది, రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్‌తో మరోసారి వార్తల్లో నిలిచింది. ఏప్రిల్ 30న పెద్ది ఎలా అలరిస్తుందో చూడాలి.
