NTV Telugu Site icon

రివ్యూ: పచ్చీస్ మూవీ

Pachchis Telugu Movie Review

ఆ మధ్యలో కొత్త దర్శకులు, నిర్మాతలు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సింపుల్ లవ్ స్టోరీస్ తీసేవాళ్ళు. ఆ తర్వాత ఈ కొత్త బ్యాచ్ హారర్ కామెడీస్ మీద పడింది. కథాబలం లేకపోయినా… పది పన్నెండు ఆసక్తికరమైన సన్నివేశాలు ఉంటే ప్రేక్షకులు పాస్ మార్కులు వేసేస్తారని వీళ్ళ నమ్మకం! నిజానికి కొంతకాలం అలానే గడిచిపోయింది. ఇప్పుడేమో వీళ్ళు క్రైమ్ థ్రిల్లర్స్ మీద పడ్డారు. ఓటీటీ ప్లాట్ ఫామ్ లో అయితే ఈ జానర్ మూవీస్ వెల్లువెత్తుతున్నాయి. ఆ జాబితాలోకి చేరేదే ‘పచ్చీస్’ మూవీ కూడా. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

కథ విషయానికి వస్తే… అభిరామ్ (రామ్) పైలా పచ్చీస్ గా తిరిగే కుర్రాడు. తండ్రేమో బ్యాంకులను మోసం చేసి జైలు పాలవుతాడు. ఈ కుర్రాడు కాసినోలో జూదానికి అలవాటు పడి అప్పుల పాలవుతాడు. అధికార దాహంతో కొట్టుమిట్టాడుతుండే రాజకీయ నాయకులు గంగాధర్ (శుభలేఖ సుధాకర్), బసవరాజు (విశ్వేందర్ రెడ్డి) లను అడ్డం పెట్టుకుని అప్పుల ఊబి నుండి బయటపడాలని అభిరామ్ ప్రయత్నిస్తుంటాడు. రాజకీయ నేతల ఆటలో బలిపశువు అయిన రాకేశ్ అనే కుర్రాడిని వెతుక్కుంటూ అతని చెల్లి అవంతి (శ్వేతవర్మ) రంగ ప్రవేశం చేస్తుంది. ఈజీ మనీకి అలవాటు పడిన అభిరామ్ గమ్యం ఏ తీరాలకు చేరింది? అవినీతి కూపంలో చిక్కుకున్న రాజకీయ నేతల భవితవ్యం ఏమిటీ? సోదరుడి ఆచూకిని అవంతి కనిపెట్టగలిగిందా? అనేది మిగతా కథ.

సెలబ్రిటీస్ స్టైలిస్ట్ అయిన రామ్ ‘పచ్చీస్’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. నిజానికి ఇది హీరో, హీరోయిన్, విలన్ కాన్సెప్ట్ లో సాగే రొటీన్ కథ కాదు. ప్రతి మనిషిలోని పాజిటివ్, నెగెటివ్ షేడ్స్ ను చూపించే సినిమా. చెడు అలవాట్లకు బానిసై స్నేహితులను సైతం అవసరానికి వాడుకునే వాళ్ళు కొందరైతే, అవసరానికి అప్పులిచ్చి మరో రకంగా పబ్బం గడుపుకోవాలని చూసే వాళ్ళు మరికొందరు. పేరుకు ప్రజా ప్రతినిధులైనా… అడ్డదారుల్లో కోట్లు గడించాలనుకునే వారు మరికొందరు. వీళ్ళ గుట్టు రట్టు చేయడం కోసం అండర్ కవర్ ఆపరేషన్ లో ప్రాణాలను పణంగా పెట్టే వాళ్ళు ఇంకొందరు. వీళ్ళందరి చుట్టూ తిరిగే క్రైమ్ థ్రిల్లర్ ఇది.

మొదటి సినిమానే అయినా రామ్ ఉన్నంతలో తన పాత్రకు బాగానే న్యాయం చేకూర్చాడు. ఇక ఇప్పటికే పలు చిత్రాల్లో నటించిన శ్వేత వర్మ సోదరుడి కోసం తపించే యువతగా చక్కని నటన ప్రదర్శించింది. అయితే… అబలగా కాకుండా తానే ఓ పోలీస్ ఆఫీసర్ అన్నట్టుగా ప్రవర్తించింది. ఈ మధ్య కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న శుభలేఖ సుధాకర్ ఇందులో పొలిటీషియన్ గా నటించారు. పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ కోసం తమ పార్టీకి చెందిన నేతకే గోతులు తవ్వే పాత్ర ఆయనది. ఇక ఆయన ప్రత్యర్థిగా నటించిన విశ్వేందర్ రెడ్డి క్యారెక్టరైజేషన్ చూస్తున్న వీక్షకులకు అర్థం కాకుండా ఉంది. రాజకీయంగా తగిలే ఎదురు దెబ్బలు, ఆరోగ్య సమస్య, దాంతో అర్థాంతరంగా సూసైడ్ చేసుకోవడం… ఇలా ఆ పాత్రను ఎక్కడో మొదలు పెట్టి ఎక్కడో ముగించారు. ఈ తరహా పాత్రలు సినిమాలో చాలానే ఉన్నాయి. ఏ పాత్ర ఎందుకు తెర మీదకు వస్తుందో, ఎందుకు అర్థాంతరంగా వెళ్ళి పోతుందో అర్థం కాదు. కథను ఆసక్తికరంగా రాసుకున్న దర్శక ద్వయం దానిని ఆ స్థాయిలో తెరకెక్కించలేకపోయింది. ఆర్.కె. కాసినో అధినేతగా రవివర్మ, పొలిటీషన్ కుడిభుజం జయంత్ గా జయచంద్ర, పోలీస్ అధికారిగా దయా, పొలిటీషియన్ బినామీ మల్లికార్జున్ గా జాన్ వీళ్ళంతా బాగానే చేశారు. కానీ వీళ్ళెవ్వరి నటన భలే ఉందే అనిపించేలా మాత్రం లేదు. మాటలు కూడా ఏదో సగం విరిచి మాట్లాడినట్టుగా ఉన్నాయి. కొన్నిసార్లు పాత్ర పరిథి దాటి వేదాంతం మాట్లాడుతోందేమిటా అనే సందేహమూ కలుగుతుంది. రాజకీయ చదరంగంలో పావుగా మారిన ఓ వ్యక్తి, అతన్ని వెతుక్కుంటూ వచ్చే అతని సోదరి, ఆ పావుగా మారిన వారి స్నేహితులు, వాళ్ళ బలహీనతలు వీటి చుట్టు తిరిగే కథే అయినా… ఆ యా వ్యక్తుల మధ్య సంబంధాలను, అనుబంధాలను స్పష్టంగా చూపించడంలో దర్శకులు విఫలమయ్యారు. సినిమా చాలా వరకూ నైట్ ఎఫెక్ట్ లోనే సాగుతుంది. ఆ ఫీల్ ను కలిగించేలా కార్తిక్ పర్మార్ సినిమాటోగ్రఫీ ఉంది. ఇక సాంకేతిక నిపుణులలో సినిమాకు సరైన బలాన్ని తన నేపథ్య సంగీతంతో స్మరణ్ అందించారు. ఈ చిత్రానికి రచయిత అయిన శ్రీకృష్ణ, నిర్మాతల్లో ఒకరైన రామసాయి ఈ మూవీని డైరెక్ట్ చేశారు. బహుశా మొదటి సారి మెగా ఫోన్ పట్టడం వల్ల కావచ్చు…. కాగితం మీద రాసుకున్న కథను బలంగా, ఆసక్తికరంగా, థ్రిల్లింగ్ గా తెరకెక్కించలేకపోయారు. కౌశిక్, రామసాయి నిర్మాతలుగా రాజీపడలేదనే చెప్పాలి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఓటీటీ వీక్షకులను దృష్టిలో పెట్టుకుని రెండు గంటల నిడివిలోనే మూవీని ముగించినా… అది కూడా ఈ కథకు ఎక్కువే అనిపిస్తుంది. మరింత దీనిని ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. ద్వితీయార్థంలో రెండు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నా… ఆ కాల్పుల తతంగం కూడా ఎలాంటి ఉత్సుకతనూ కలిగించదు. ఏదో అసందిగ్దమైన, అసంపూర్ణమైన సినిమాను చూశామనే భావనే వీక్షకులకు కలుగుతుంది. మిస్సింగ్ పర్శన్ ను వెతుక్కుంటూ సాగే కథలు మనకేం కొత్త కాదు. ఇప్పటికే ఇలాంటి సినిమాలను చాలానే చూశాం. అందులో ఇది కూడా ఒకటి. కాకపోతే… ముందు వచ్చిన చిత్రాలలోని గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ‘పచ్చీస్’లో లేకపోయింది.

రేటింగ్ : 2.25 / 5

ప్లస్ పాయింట్స్
ప్రధాన తారాగణం నటన
సినిమాటోగ్రఫీ
నేపథ్య సంగీతం

మైనెస్ పాయింట్
కథను చెప్పడంలో తడబాటు
నీరసం తెప్పించే కథనం
ఏ మాత్రం పండని ఎమోషన్స్

ట్యాగ్ లైన్: ఓడిన జూదం!

Show comments