మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ షెరాజ్ మెహదీ దర్శకత్వంలో రూపొందిన సందేశాత్మక చిత్రం ‘ఓ అందాల రాక్షసి’. గతంలో విడుదలైనప్పుడు పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమాను.. ప్రేక్షకుల కోరిక మేరకు ఈ నెల ఏప్రిల్ 24న గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో చిత్ర యూనిట్ ప్రత్యేక షోను నిర్వహించి.. మీడియా సమావేశంలో సినిమా విశేషాలను పంచుకున్నారు.
ఓ అందాల రాక్షసి సినిమా కేవలం కమర్షియల్ హంగులతో కాకుండా.. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల చుట్టూ తిరుగుతుంది. ఇది గ్లామర్ కంటే కథా బలానికి ప్రాముఖ్యతనిచ్చే వుమెన్ ఓరియెంటెడ్ చిత్రం. అమాయక మహిళలు మోసగాళ్ల బారిన పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ సబ్జెక్టును ఎంచుకున్నట్లు దర్శకుడు తెలిపారు. అమ్మాయిలపై వేధింపులు, అత్యాచారాలకు పాల్పడే దుర్మార్గులకు ఎలాంటి శిక్షలు ఉండాలో ఈ సినిమాలో చూపించారు.
‘అమ్మాయిలకు మోసాలు జరగకూడదనే లక్ష్యంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాను. సమాజంలో మహిళల జోలికి వస్తే ఎదురయ్యే భయంకరమైన పరిణామాలను ఇందులో కళ్లకు కట్టినట్లు చూపించాం. గతంలో థియేటర్లలో చూడలేకపోయిన వారు ఈ రీ-రిలీజ్ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను’ అని దర్శకుడు షెరాజ్ మెహదీ చెప్పారు. ఈ చిత్రానికి షెరాజ్ మెహదీ కేవలం దర్శకత్వం వహించడమే కాకుండా హీరోగా కూడా నటించారు. అంతేకాకుండా సంగీతం కూడా అందించడం విశేషం. కన్నడలో కూడా ‘ఓ సుందర రాక్షసి’ పేరుతో విడుదలై ఈ చిత్రం మంచి ఆదరణ పొందింది. ఈ చిత్రంలో సీనియర్ నటులు, వర్ధమాన నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. హాన్షి హెగాడే, కృతి వర్మ, నేహా దేశపాండే, సుమన్ తల్వార్, తమ్మారెడ్డి భరద్వాజ్, అనంత్ బాబు, ప్రియా తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
