NTV Telugu Site icon

10 Years For Julayi : పదేళ్ళ ‘జులాయి’

Julayi

Julayi

కొన్ని కాంబినేషన్స్ జనానికి భలేగా గుర్తుండి పోతాయి. సదరు కాంబోలో వచ్చిన చిత్రాలూ అలాగే మదిలో మెదలుతూ ఉంటాయి. గుర్తు చేసుకున్న ప్రతీసారి కితకితలు మన సొంతం చేస్తూ ఉండడం కూడా ఆ సినిమాల ప్రత్యేకత! అలాంటి కాంబో ఈ మధ్యకాలంలో ఎవరిదంటే హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ త్రివిక్రమ్ దే అని చెప్పాలి. సరిగా పదేళ్ళ క్రితం వీరి కలయికలో రూపొందిన ‘జులాయి’ చిత్రం ప్రేక్షకులకు భలేగా గిలిగింతలు పెట్టింది. అందులోని కొన్ని సన్నివేశాలు ఈ నాటికీ గుర్తు చేసుకోగానే నవ్వులు మన పెదాలపై నాట్యం చేయక మానవు.

‘జులాయి’ ఘనవిజయంలో త్రివిక్రమ్ డైరెక్షన్ తో పాటు ఆయన రాసిన డైలాగ్స్ కీలక పాత్ర పోషించాయని చెప్పాలి. హీరో వయలెన్స్ చూసి “వీడికి కొంచెం పువ్వులు, అమ్మాయిలను చూపించండ్రా… మరీ వయలెంట్ గా ఉన్నాడు” అనే మాటలు తరువాతి రోజుల్లో కొట్లాడుకొనే కుర్రాళ్ళను చూసి జనం అనడం అలవాటు చేసుకున్నారు. “అదృష్టమంటే ఏంటో తెలుసా? మనం ఇష్టంగా అనుకొనేదే అదృష్టం… బలంగా కోరుకొనేదే భవిష్యత్…”- ఇలా కుర్రాళ్ళను ఉడికించే మాటలు సైతం బోలెడు వినిపిస్తాయి. ఇక అల్లు అర్జున్ పాటల్లో ఆటలు, ఇలియానా నాజూకు షోకులు సైతం కలగలసి ‘జులాయి’కి మరింత మైలేజ్ పెంచాయనే చెప్పాలి. కావాలంటే ఇప్పటికీ ఇందులోని పాటలు, మాటలు యూ ట్యూబ్ లోనూ దర్శనమిస్తాయి చూసుకొని మురిసిపోండి.

‘జులాయి’ తరువాత త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’లోనూ కితకితలకు కొదువే లేదు. వీరి కలయికలో వచ్చిన మూడో సినిమా ‘అల…వైకుంఠపురములో’ సినిమాలోనూ అదే తీరు! ఈ మూడు చిత్రాల్లోనూ రాజేంద్రప్రసాద్ కామెడీ కూడా ఎస్సెట్ గా నిలవడం మరో విశేషం!

‘జులాయి’కి దేవిశ్రీ ప్రసాద్ బాణీల్లో రూపొందిన పాటలు కూడా భలేగా అలరించాయి. శ్రీమణి రాసిన “చక్కని బైకుంది…”, “ఒసేయ్ ఒసేయ్…”, “మీ ఇంటికి ముందు….” అంటూ సాగే పాటలు, దేవిశ్రీ ప్రసాద్ సైతం చేయి చేసుకున్న “ఓ మధు ఓ మధు….” పాట, రామజోగయ్య రాసిన టైటిల్ సాంగ్, “పకడో పకడో…” సాంగ్ ఆకట్టుకున్నాయి. పదేళ్ళ క్రితం పాటలు, మాటలతో పరవశింపచేసిన ‘జులాయి’ని ఇప్పుడు చూసినా గిలిగింతలు కలుగక మానవు.