Site icon NTV Telugu

Niranjan Reddy: మోసపోయా.. ఛాంబర్ ముందుకు హనుమాన్ నిర్మాత!

Hanuman Producer

Hanuman Producer

నిరంజన్ రెడ్డి, ప్రముఖ నిర్మాతగా తెలుగు సినిమా పరిశ్రమలో ప్రత్యేక పరిచయం అవసరం లేని వ్యక్తి. నిజానికి, “హనుమాన్” సినిమాకు ముందు ఆయన “బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్” అనే సినిమాను నిర్మించారు. అయితే, “హనుమాన్” సినిమాతో ఆయనకు విశేషమైన గుర్తింపు లభించింది. ఆ తర్వాత, ఆయన “డార్లింగ్” సినిమాను నిర్మించి, “డబుల్ ఇస్మార్ట్” సినిమాను డిస్ట్రిబ్యూట్ చేశారు. అయినప్పటికీ, ఆయన్ను ఎక్కువ మంది “హనుమాన్” నిర్మాతగానే గుర్తిస్తారు. ప్రస్తుతం, నిరంజన్ రెడ్డి సాయిధరమ్ తేజ్ హీరోగా “సంబరాల ఏటిగట్టు”, కిచ్చా సుదీప్ హీరోగా “బిల్లా రంగ బాష” అనే మరో సినిమాను నిర్మిస్తున్నారు. అయితే, ఆయన ప్రశాంత్ వర్మ, పూరి జగన్నాథ్, ఛార్మీతో సహా కొందరు తనను మోసం చేశారని భావించి, ఫిలిం ఛాంబర్‌ను ఆశ్రయించినట్లు తెలుస్తోంది.

Gaddar Cine Awards: ఉమ్మడి రాష్ట్రంలో కూడా చలన చిత్ర అవార్డ్స్ కు ఇంత స్పందన రాలేదు!

అసలు విషయం ఏమిటంటే, “హనుమాన్” సక్సెస్ తర్వాత ప్రశాంత్ వర్మ, మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి ఆ సినిమా సీక్వెల్ చేసేందుకు సిద్ధమయ్యారు. “హనుమాన్” కోసం భారీగా పెట్టుబడులు పెట్టిన నిరంజన్ రెడ్డిని ఈ విషయంలో ప్రశాంత్ వర్మ మోసం చేశారని ఆయన భావిస్తున్నారు. అలాగే, పూరి జగన్నాథ్, ఛార్మీ నిర్మాతలుగా రూపొందిన “డబుల్ ఇస్మార్ట్” సినిమా థియేటర్ రైట్స్‌ను నిరంజన్ రెడ్డి 40 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. అయితే, ఈ సినిమా వల్ల ఆయనకు దాదాపు 30 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. ఈ నష్టానికి పరిహారంగా పూరి జగన్నాథ్, ఛార్మీ నుంచి ఏదైనా ఆశించినా, అక్కడ కూడా ఆయనకు నిరాశే ఎదురైంది. వారు తమ తదుపరి సినిమా నిర్మాణ బాధ్యతలను నిరంజన్ రెడ్డికి అప్పగిస్తారని ఆయన ఆశించినప్పటికీ, అది కూడా కుదరలేదు. నిరంజన్ రెడ్డి కేవలం నిర్మాత మాత్రమే కాదు, డిస్ట్రిబ్యూటర్ కూడా. చాలా ఏరియాల్లో చాలా సినిమాలు పంపిణీ చేయగా కొన్ని సినిమాలు రెండు రాష్ట్రాల స్థాయిలో హక్కులు కొని నష్టపోయారు. డబుల్ ఇస్మార్ట్ లాంటి సినిమా వల్ల దారుణంగా దెబ్బతిన్నారు. ఏయే సినిమాల వల్ల ఏయే విధంగా నష్టపోయా? ఎవరెవరి వల్ల తనకు డబ్బులు రావాలి? తనకు పరిహారం ఎంత రావాలి? అనే లెక్కలతో వివిధ నిర్మాణ సంస్థల మీద నిరంజన్ రెడ్డి ఒకేసారి ఫిర్యాదు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు త్వరలో తెరపైకి రావచ్చు.

Exit mobile version