Site icon NTV Telugu

Nidhi Agarwal: అసభ్యకరంగా తాకిన వారిని లైట్ తీసుకున్న నిధి?

Nidhi Agarwal

Nidhi Agarwal

సినిమా ప్రమోషన్ల సందర్భంగా హీరో, హీరోయిన్లకు ఎదురయ్యే చేదు అనుభవాలు కొత్తేమీ కాదు. అభిమానుల ఉత్సాహం కొన్నిసార్లు హద్దులు దాటి, అవాంఛనీయ సంఘటనలకు దారి తీస్తుంటుంది. తాజాగా ‘రాజా సాబ్’ సినిమా పాటల విడుదల కార్యక్రమం సందర్భంగా నటి నిధి అగర్వాల్‌కు ఎదురైన అనుభవం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. లులు మాల్‌లో జరిగిన ఈవెంట్‌లో అభిమానులు శ్రుతి మించి ప్రవర్తించడం, ఆ తర్వాత నిధి అగర్వాల్ ఫిర్యాదు చేయడానికి నిరాకరించడం చర్చనీయాంశంగా మారింది.

Also Read :Betting Apps: ‘ఉచ్చు’లో సెలబ్రిటీలు: రీతూ చౌదరి, భయ్యా సన్నీ ఖాతాల్లో లక్షలాది రూపాయలు?

‘రాజా సాబ్’ సినిమా సాంగ్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లోని లులు మాల్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిధి అగర్వాల్ హాజరయ్యారు. వేడుక అనంతరం ఆమె తిరిగి వెళ్తుండగా, అభిమానులు ఒక్కసారిగా ఆమెపైకి దూసుకువచ్చారు. సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో, ఫ్యాన్స్ కంట్రోల్ తప్పి నిధి అగర్వాల్‌ను అసభ్యకరంగా తాకుతూ, అమానుషంగా ప్రవర్తించారు. ఈ ఘటనతో ఆమె తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఈ మేరకు కొన్ని వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Also Read :Sankranthi Fight: స్టార్ హీరోలకు యంగ్ హీరోల ‘టికెట్’ షాక్.. గెలుపెవరిది?

అభిమానుల ప్రవర్తన, భద్రతా లోపాలపై దృష్టి సారించిన పోలీసులు, ఈవెంట్ నిర్వాహకులైన శ్రేయస్ మీడియా సహా లులు మాల్‌లపై ఇప్పటికే పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా, బాధితురాలు నిధి అగర్వాల్‌ను సంప్రదించిన పోలీసులు, ఆమెపై అసభ్యకరంగా ప్రవర్తించిన అభిమానులపై ఫిర్యాదు చేయాలని కోరారు. అయితే, పోలీసుల విజ్ఞప్తికి నిధి అగర్వాల్ విముఖత వ్యక్తం చేశారు. “తాను ఎవరిపైనా ఫిర్యాదు చేయదలచుకోలేదని” ఆమె స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. నిధి అగర్వాల్ ఫిర్యాదు చేయకపోవడంతో, పోలీసులు చేసేదేమీ లేక వెనుతిరిగారు. అయితే ఇలాంటి సంఘటనల పట్ల సెలబ్రిటీలు స్పందించకపోవడంపై పోలీసు ఉన్నతాధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “సెలబ్రిటీలు ఇలాంటి ఘటనలపై ధైర్యంగా ఫిర్యాదు చేస్తేనే, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా అడ్డుకోవచ్చు. ఒకవేళ ఫిర్యాదు చేయకపోతే, బాధ్యతారహితంగా ప్రవర్తించేవారికి మరింత ప్రోత్సాహం లభిస్తుంది” అని ఒక ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు.

Exit mobile version