మన దేశంలో సినిమా అనేది కేవలం రెండున్నర గంటల వినోద సాధనం మాత్రమే కాదు, అదొక నిత్య జీవితంలో భాగం.. ఇంకా చెప్పాలంటే అదొక మతం! తెరపై కనిపించే స్టార్లు వేసుకునే బట్టల నుంచి, వాళ్ళు మాట్లాడే డైలాగుల వరకు ప్రతిదీ సామాన్యుల జీవితాల్లోకి బలంగా చొచ్చుకుపోయింది. మన కోపాన్ని, బాధను, సంతోషాన్ని వ్యక్త పరిచే హావభావాలు సైతం ఆ స్క్రీన్ మీద నుంచే పుట్టుకొస్తున్నాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వాడుక భాషలో మనం మాట్లాడుకునే ఎన్నో పదాలకు పేటెంట్ సినిమాలదే. మనకు స్ట్రెస్ వచ్చినా సినిమాకే వెళ్తాం.. ఆ సినిమానే కొన్నిసార్లు మన జీవితాల్లో కొత్త కష్టాలను తెచ్చిపెడుతోంది. అయితే, ఇక్కడే ఒక సంచలన, భయంకరమైన వాస్తవాన్ని మనం మాట్లాడుకోవాలి. సమాజంలో జరుగుతున్న దారుణాలు, నేరాలకు తమకు ఎలాంటి సంబంధం లేదని, సినిమాలను కేవలం సినిమాల్లాగే చూడాలని మేకర్స్ చాలా ఈజీగా చేతులు దులుపుకోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. “మేము కేవలం సమాజంలో జరిగేదే చూపిస్తున్నాం” అంటూ తప్పించుకుంటే సరిపోతుందా? ఇటీవల రాప్తాడులో జరిగిన ఓ సంఘటన తెలుగు సహా సినిమాల ప్రభావం గురించి మరోసారి చర్చకు తెరలేపాయి.
సినిమాల్లో విలన్లు, హీరోలు ముందు నుంచి ఉన్నారు. విలన్ ఎంతటి దుర్మార్గుడైనా, ఎన్ని ఘోరాలు చేసినా సమాజం వాడ్ని ఫాలో అవ్వదు.. పైగా వాడిని అసహ్యించుకుంటుంది. కానీ, అదే తెర మీద ఒక ‘హీరో’ అరాచకాలు చేస్తూ, దౌర్జన్యాలకు పాల్పడుతూ, తన నేరాలకు తానే ఒక జస్టిఫికేషన్ ఇచ్చుకుంటే.. యువత కచ్చితంగా ప్రభావితం అవుతుంది. ఎందుకంటే, నిజ జీవితంలో ఏ యువకుడికైనా వాడికి వాడే ఒక హీరో!. తెర మీద తమ అభిమాన హీరో చేసే ఘోరాలను, చట్ట వ్యతిరేక పనులను ‘స్టైల్’గా, ‘హీరోయిజం’గా భావించి ఓ ఏజ్ గ్రూప్ యువత గుడ్డిగా అనుకరిస్తోంది.
పర్యవసానంగా నిజ జీవితంలో నేరాలకు పాల్పడుతున్నారు. ఈ ‘నెగటివ్ హీరోయిజం’ వల్ల సమాజంలో క్రైమ్ రేట్ పెరుగుతోందన్నది కాదనలేని సత్యం. సమాజంలో జరుగుతున్న ఘోరాల వెనుక మా పాత్ర ఏమీ లేదని ఈ సినిమా వాళ్ళు అంత ఈజీగా ఎలా సైడ్ అయిపోతారు మాష్టారు? వారి క్రియేటివ్ ఫ్రీడమ్ వెనుక సామాజిక బాధ్యత ఉండక్కర్లేదా? తెర మీద దేవుళ్లుగా వెలుగొందే ఈ స్టార్లు.. మేకప్ తీసేశాక, తెర దించేశాక వారు కూడా మనలాంటి సామాన్యులే అన్న నిజాన్ని జనాలు ఎప్పుడు గుర్తిస్తారో అర్థం కాని పరిస్థితి. దురదృష్టం ఏంటంటే.. వాస్తవ ప్రపంచంలోకి వచ్చాక కూడా కొందరికి వాళ్లు దేవుళ్లుగానే కనిపిస్తున్నారు. వాళ్లు ఏం చేసినా రైటే అనేంతగా బానిసలయ్యారు. ఈ గుడ్డి అభిమానం, ఆరాధన ఎక్కడిదాకా వెళ్తోందంటే.. తమ వాస్తవ జీవితాలను, భవిష్యత్తును నాశనం చేసుకునే స్థాయికి చేరింది. ఈ ‘హీరోయిజం’ మత్తులో పడి ప్రతిరోజూ ఎవరో ఒకరు, ఏదో ఒక రూపంలో బలి కావాల్సిందేనా? ఒక అదృశ్య నేర సామ్రాజ్యానికి సినిమాలే పునాదులు వేస్తున్నాయా అన్న అనుమానాలు ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. సమాజం శ్రేయస్సు పట్ల సినిమా రంగానికి కనీస బాధ్యత గుర్తుచేయాల్సిన సమయం ఆసన్నమైంది!

