తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నవీన్ పొలిశెట్టి, మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘అనగనగా ఒక రాజు’తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ఈ సంక్రాంతికి ప్రేక్షకులను నవ్వుల కనుక అందివ్వబోతున్నట్టు అర్ధం అవుతోంది. బంగారు ఆభరణాల ప్రకటనపై స్పూఫ్ తో ప్రారంభమైన ఈ టీజర్, ఎంతో వైవిధ్యంగా ఉంది. ఒంటి నిండా ఆభరణాలు ధరించిన మీనాక్షి చౌదరి, తమ సినిమా గురించి కాకుండా ఆభరణాల గురించి మాట్లాడుతుండటంతో ఆమె ఆభరణాలను నవీన్ పొలిశెట్టి ధరించి కనిపించడం భలే సరదాగా ఉంది. టీజర్ లో నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి పోటాపోటీగా నవ్వులు పంచారు. వినోదాల వేడుకకు వేదికగా ఈ టీజర్ నిలిచింది. ఇప్పటికే విడుదైన పోస్టర్లు, గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజా టీజర్ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నవీన్ యొక్క అద్భుతమైన కామెడీ టైమింగ్ ప్రతి ఫ్రేమ్ లో ప్రకాశించింది. తెరపై నవీన్ ఉత్సాహంగా కనిపించిన తీరు సంక్రాంతి పండుగకు ప్రేక్షకులు కోరుకునే అసలైన వినోదాల విందుకి వాగ్దానంలా ఈ టీజర్ నిలిచింది. కేవలం ఒక నిమిషం కంటే ఎక్కువ నిడివితో రూపొందిన ఈ టీజర్, సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. అంతేకాకుండా హాస్యం, తాజాదనం మరియు కమర్షియల్ పంచ్‌లను మిళితం చేసే చిత్రాలను ఎంచుకోవడంలో నవీన్ పొలిశెట్టి నైపుణ్యాన్ని పునరుద్ఘాటించింది. టీజర్ చూసిన ప్రతి ఒక్కరూ నవీన్ ఖాతాలో మరో ఘన విజయం ఖాయమని ప్రశంసలు కురిపిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2026 జనవరి 14న విడుదల కానున్న ‘అనగనగ ఒక రాజు’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా విడుదలైన టీజర్, ఆ అంచనాలను రెట్టింపు చేసింది.
