వెండితెరపై అయినా, నిజ జీవితంలో అయినా నందమూరి బాలకృష్ణకు ఉన్న మాస్, ఫియర్‌లెస్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, ఎవరికీ భయపడని బాలయ్య బాబు కూడా తన జీవితంలో ఒకే ఒక్క వ్యక్తికి భయపడతారని ఆయన అల్లుడు, ఏపీ ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ అసలు సీక్రెట్ లీక్ చేశారు. విలక్షణ నటుడు జగపతిబాబు హోస్ట్‌గా జీ5 (ZEE5) వేదికగా ప్రసారమవుతున్న టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సీజన్ 2లో పాల్గొన్న లోకేశ్.. తన మామ గురించి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారాయి. సాయి పల్లవి, త్రివిక్రమ్-థమన్ (స్పెషల్ గెస్ట్ సునీల్) ఎపిసోడ్స్ తర్వాత ఈ షో మూడో ఎపిసోడ్‌కు నారా లోకేశ్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. తాజాగా విడుదలైన ఈ ఎపిసోడ్ ప్రోమో ఆద్యంతం ఫన్నీగా, ఆసక్తికరంగా సాగింది. తన స్కూల్ డేస్ విషయాలను సరదాగా గుర్తుచేసుకున్న లోకేశ్.. అప్పట్లో తరగతిలో టీచర్ల నుంచి అత్యధిక పనిష్మెంట్లు అందుకున్నది తానేనని చెప్పారు. “నిజంగానే అంత అల్లరి చేసేవారా?” అని జగ్గూభాయ్ అడగ్గా.. అల్లరిలో తన మామయ్య బాలకృష్ణతోనే పోటీ పడాల్సి వచ్చేదని లోకేశ్ చమత్కరించారు.
ఇక తన పెళ్లి సమయంలో జరిగిన ఓ ఫన్నీ ఇన్సిడెంట్‌ను కూడా ఆయన పంచుకున్నారు. ఒకరోజు సడెన్‌గా తనను “అల్లుడుగారు” అని పిలవగానే.. నాకేదో పెద్ద ఫిట్టింగ్ పెట్టడానికే ఇలా ప్లాన్ చేస్తున్నారని తనకు అప్పుడే అర్థమైపోయిందంటూ నవ్వులు పూయించారు. అంతేకాకుండా, ప్రోమో చివర్లో బాలయ్య ‘లెజెండ్’ సినిమాలోని ఐకానిక్ డైలాగ్.. “ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు!” అని లోకేశ్ తనదైన మాస్ స్టైల్‌లో చెప్పడం అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. రాజకీయాల్లో నిత్యం బిజీగా ఉండే లోకేశ్, ఇలా ఒక వినోదభరితమైన టాక్ షోలో పాల్గొని తన పర్సనల్ లైఫ్ ముచ్చట్లు పంచుకోవడం అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. మరి బాలయ్య భయపడే ఆ ఒక్కరు ఎవరు? లోకేశ్ పెళ్లి టైమ్‌లో జరిగిన ఆ ‘ఫిట్టింగ్’ స్టోరీ ఏంటి? తెలియాలంటే నవంబర్ 6న జీ5 ఓటీటీలో ప్రీమియర్ కానున్న పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే. ఈ ఎపిసోడ్ నవంబర్ 8వ తేదీ రాత్రి 7:30 గంటలకు జీ తెలుగు ఛానెల్‌లో కూడా టెలికాస్ట్ కానుంది.

