Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?

Nana Patekar

Nana Patekar

Nana Patekar Funeral: విలక్షణ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ 75 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన మరణంతో చిత్ర పరిశ్రమతో పాటు రాజకీయ, క్రీడా రంగాల్లోనూ విషాదం నెలకొంది. నానా పటేకర్ మృతిపై పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతితో అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మరాఠీ నాటకరంగం, మరాఠీ, హిందీ సినిమా రంగాలకు నానా పటేకర్ అందించిన సేవలకు గుర్తింపుగా ఆయనకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి ఆశిష్ షెలార్ ప్రకటించారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

పుణెలోని ఫామ్‌హౌస్‌లో అంత్యక్రియలు
నానా పటేకర్ చివరి కోరిక మేరకు ఆయన అంత్యక్రియలు పుణెలోని తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించనున్నారు. అక్కడే ప్రభుత్వ లాంఛనాలతో ఆయనకు తుది వీడ్కోలు పలకనున్నారు. నానా పటేకర్ చివరి కోరికను గౌరవిస్తూ కుటుంబ సభ్యులు ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

అకస్మాత్తుగా కన్నుమూసిన నానా పటేకర్
గురువారం ఉదయం నానా పటేకర్ మరణవార్త సినీ పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన కుమారుడు మల్హర్ పటేకర్ తండ్రి మరణాన్ని ధృవీకరించారు. ఇక, వైద్య నివేదికల ప్రకారం, నానా పటేకర్ తీవ్రమైన ఛాతీ నొప్పితో బాధపడటంతో ఆయన నివాసానికి వైద్య బృందాన్ని పంపించారు. వైద్యులు అక్కడికి చేరుకునే సమయానికి ఆయన అపస్మారక స్థితిలో ఉన్నట్లు సమాచారం. అనంతరం గోవాలోని మణిపాల్ ఆసుపత్రిలో ఉదయం 5:20 గంటలకు వైద్యులు ఆయన మరణాన్ని ప్రకటించినట్లు నివేదికలు పేర్కొన్నాయి.

ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ప్రత్యేక గుర్తింపు
నానా పటేకర్ తన విభిన్నమైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. ‘పరిందా’, ‘తిరంగా’, ‘అగ్నిసాక్షి’, ‘ఖమోషి: ది మ్యూజికల్’, ‘వెల్కమ్’, ‘అపహరణ్’, ‘రాజనీతి’ వంటి చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు విశేష గుర్తింపు పొందాయి. ప్రతినాయకుడి పాత్రల నుంచి హాస్యం వరకే కాదు.. క్యారెక్టర్ ఏదైనా.. ఆ పాత్రకు న్యాయం చేస్తూ.. విభిన్నమైన పాత్రల్లో ఆయన తన నటనా ప్రతిభను చాటుకున్నారు.

దర్శకుడిగా, రచయితగా కూడా..
నటుడిగానే కాకుండా నానా పటేకర్ దర్శకుడిగా, రచయితగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు. 1991లో వచ్చిన ‘ప్రహార్: ది ఫైనల్ ఎటాక్’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. సినిమా రంగంతో పాటు వ్యవసాయంపై కూడా ఆయనకు ప్రత్యేక ఆసక్తి ఉండేది. రైతులతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. రైతుల సమస్యలు, వారి పరిస్థితులపై నానా పటేకర్ అనేక సందర్భాల్లో బహిరంగంగా మాట్లాడారు. అయితే, నానా పటేకర్ మరణంతో భారతీయ సినీ రంగం ఓ విలక్షణ నటుడిని కోల్పోయింది. ఆయన నటించిన పాత్రలు, సామాజిక అంశాలపై ఆయన స్పందించిన తీరు, సినీ రంగానికి చేసిన సేవలు అభిమానులు, సినీ ప్రేక్షకుల జ్ఞాపకాల్లో నిలిచిపోనున్నాయి.