కింగ్ నాగార్జున చివరిసారిగా “వైల్డ్ డాగ్” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో ఎన్ఐఏ ఏజెంట్ గా నాగార్జున నటనకు ప్రశంసలు కురిశాయి. కరోనా టైంలో విడుదలైన ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం నాగార్జున “సోగ్గాడే చిన్ని నాయన” ప్రీక్వెల్ “బంగార్రాజు”తో పాటు డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుతో ఒక సినిమా చేస్తున్నారు. తాజాగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ అప్డేట్ వచ్చింది. ప్రవీణ్ సత్తారు, నాగార్జున మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభమవుతుంది. ఈ సినిమా మొదటి షెడ్యూల్ కరోనా సెకండ్ వేవ్ కంటే ముందు గోవాలో పూర్తి చేసుకుంది. ఇప్పుడు రెండవ షెడ్యూల్ ఆగస్టు 4 నుండి హైదరాబాద్‌లో ప్రారంభమవుతుంది.
Read Also : వీడియో : కొత్త కళలో పట్టు సాధిస్తున్న అకీరానందన్
ఈ షెడ్యూల్ సుదీర్ఘంగా ఉండనుంది. ఇందులో సినిమాలోని ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరించబడతాయి. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన మరో భారీ షెడ్యూల్ విదేశాల్లో షూటింగ్ జరుపుకోనుంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ మొదటిసారిగా నాగార్జునతో కలిసి నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. ముఖేష్ జి సినిమాటోగ్రాఫర్. విభిన్నమైన, విజయవంతమైన చిత్రాలను అందించడంలో ప్రవీణ్ సత్తారుకు మంచి పేరు ఉండడంతో అక్కినేని అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
