మలయాళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. లెజెండరీ యాక్టర్ మోహన్‌లాల్ తల్లి శాంతకుమారి (90) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. కొచ్చిలోని ఎలమక్కరలోని మోహన్‌లాల్ నివాసంలో ఈరోజు తుదిశ్వాస విడిచారు. శాంతకుమారి అంత్యక్రియలు బుధవారం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మోహన్‌లాల్ తండ్రి, దివంగత విశ్వనాథన్ నాయర్ ప్రభుత్వ ఉద్యోగిగా సేవలందించారు.
సాధారణ జీవితం, మంచి వ్యక్తిత్వంతో శాంతకుమారి అందరి అభిమానాన్ని చూరగొన్నారు. మోహన్‌లాల్, ఆయన సినిమాలను ఆమె ఎంతగానో అభిమానించే వారు. మోహన్‌లాల్ కూడా తన తల్లిపై ఎప్పటికపుడు ప్రత్యేకమైన మమకారం చూపేవారు. శాంతకుమారి ఎప్పుడూ వెలుగులోకి రాకున్నా.. మోహన్‌లాల్ సినీ జీవితంలో కీలక పాత్ర పోషించారు. తన విజయాలకు తల్లే ప్రధాన కారణమని మోహన్‌లాల్ అనేక సందర్భాల్లో చెప్పారు. తన తల్లి ఆశీస్సులతోనే తాను ఈ స్థాయికి వచ్చానని చెప్పారు.
Also Read: AP Group 2: గ్రూప్-2 అభ్యర్ధులకు హైకోర్టులో బిగ్ రిలీఫ్!
ఇటీవల చెన్నైలో ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న సమయంలో మోహన్‌లాల్ ముందుగా తన తల్లి ఆశీర్వాదాలు తీసుకోవడం అందరినీ చలింపజేసింది. తల్లి, కుమారుడి మధ్య ఉన్న ఆత్మీయ బంధానికి ఇది నిదర్శనంగా నిలిచింది. శాంతకుమారి మృతి మోహన్‌లాల్ కుటుంబానికే కాకుండా.. ఆయన అభిమానులకు కూడా తీరని లోటుగా మారింది. శాంతకుమారి మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
