Memu COPlam: కోడిపుంజు కోసం పోలీసుల వేట.. నవ్వుల విందుగా నాగబాబు ‘మేము ‘కాప్’లం’ ట్రైలర్!

Memu Coplam

Memu Coplam

Memu COPlam: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ZEE5 (జీ5) మరో ఆసక్తికరమైన వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కామెడీ – మిస్టరీ అంశాల కలయికతో తెరకెక్కిన ‘‘మేము‘కాప్’లం’’ సిరీస్ ట్రైలర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో క్యూరియాసిటీని పెంచుతోంది. మే 22 నుంచి ఈ సిరీస్ జీ5లో స్ట్రీమింగ్ కానుంది.

కథా నేపథ్యం:
మహదేవపట్నం అనే గ్రామంలో ఈ కథ మొదలవుతుంది. ఊరి పెద్ద గజపతిరాజు (నాగబాబు) తన వారసుడు వచ్చాడంటూ ‘సలార్ రాజు’ను పరిచయం చేస్తాడు. అయితే, ఈ సలార్ రాజు మరెవరో కాదు.. కోళ్ల పందెంలో గెలవాల్సిన ఒక కోడిపుంజు. అనుకోకుండా ఆ కోడిపుంజు కనిపించకుండా పోవడంతో ఊళ్లో గందరగోళం మొదలవుతుంది. ఈ మిస్సింగ్ కేసును ఛేదించడానికి రవి, మోహన్ సోటారి అనే ఇద్దరు పోలీసులు (గెటప్ శ్రీను, రవితేజ నన్నిమల) రంగంలోకి దిగుతారు. కోడిపుంజు కోసం వారు వెతికే క్రమంలో ఎదురయ్యే విచిత్ర పరిస్థితులు, వారు చేసే తప్పులు కడుపుబ్బ నవ్విస్తాయి. అయితే ఈ వెతుకులాటలో వారు ఊహించని విధంగా గ్రామానికి సంబంధించిన ఒక పెద్ద మిస్టరీని ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు ఆ రహస్యం ఏంటి? సలార్ రాజు దొరికాడా? లేదా? అనేదే ఈ సిరీస్‌లో చూడాల్సిందే.

ఈ సిరీస్‌లో నాగబాబు ప్రధాన పాత్రలో నటించగా.. గెటప్ శ్రీను, రవితేజ నన్నిమల కీలక పాత్రలు పోషించారు. ‘వికటకవి’ ఫేమ్ ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించగా, రా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై బి.వి.ఎస్. రవి, కౌముది కె నేమాని దీనిని నిర్మించారు. శోభన్ చిట్టుప్రోలు ఈ కథను అందించారు. మహదేవపట్నంలోని గందరగోళాన్ని, ఆ ఇద్దరు పోలీసుల హడావుడిని చూడాలంటే మే 22 వరకు వేచి చూడాల్సిందే. తెలుగు జీ5 ఒరిజినల్స్‌లో ఇదొక విభిన్నమైన సిరీస్‌గా నిలుస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.