సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నూతలపాటి వెంకటరమణ ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు తెలుగు వారి నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా తెలుగు తేజం శ్రీ ఎన్.వి రమణ గారికి శుభాభినందనలు తెలియజేశారు. ఈ మేరకు చిరంజీవి “మన తెలుగు తేజం శ్రీ ఎన్.వి రమణ గారు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా వారికి శుభాభినందనలు. వ్యవసాయ కుటుంబంలో పుట్టి, విద్యార్ధి దశ నుంచే రైతుల పక్షాన నిలిచి పోరాడిన రైతు బిడ్డ , సామాన్యుల కష్టం తెలిసిన పాత్రికేయుడు, గత 40 ఏళ్లుగా న్యాయక్షేత్రంలో కృషీవలుడు శ్రీ రమణ గారు. అత్యున్నత న్యాయస్థానంలో అత్యున్నత పదవి 55 సంవత్సరాల తరువాత చేపడుతున్న ఈ తెలుగు బిడ్డను చూసి ఆయన పుట్టిన ఊరు పులకించిపోతుంది” అంటూ ట్వీట్ చేశారు. ఇక ఏప్రిల్ 24న కొత్త సీజేఐగా జస్టిస్ గా బాధ్యతలు చేపడుతున్న ఎన్.వి రమణ… 2022 ఆగష్టు 26 వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగనున్నారు. కాగా దేశ ప్రధాన న్యాయమూర్తిగా తెలుగు వ్యక్తికి రెండవసారి అవకాశం దక్కడం విశేషం. గతంలో జస్టిస్ కోకా సుబ్బారావు సీజేఐగా బాధ్యతలు నిర్వహించగా.. ఇప్పుడు ఎన్.వి రమణ సీజేఐగా బాధ్యతలు చేపడుతున్నారు.
తెలుగు తేజం శ్రీ ఎన్.వి రమణ గారికి శుభాభినందనలు : చిరంజీవి
