ప్రదీప్ రంగనాథన్ హీరోగా, కీర్తిశ్వరన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డ్యూడ్’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం దీపావళి కానుకగా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అక్టోబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ‘ప్రేమలు’ అద్భుతమైన విజయం తర్వాత ప్రదీప్ సరసన నటించిన మమితా బైజు, తాజాగా జరిగిన విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలను పంచుకున్నారు.
Also Read :Aryan : ‘ఐయామ్ ది గాయ్’ అంటున్న విష్ణు విశాల్
“లవ్ టుడే, డ్రాగన్‌ల వంటి రెండు వరుస హిట్‌లను అందించిన ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ‘ప్రేమలు’ రిలీజ్ తర్వాత మేకర్స్ నన్ను సంప్రదించారు. ఆ తర్వాత దర్శకుడు కీర్తిశ్వరన్‌తో మీటింగ్ జరిగింది. ఆయన కథ చెప్పిన తీరు, కాన్సెప్ట్ నాకు బాగా నచ్చాయి,” అని మమితా బైజు తెలిపారు. ఈ కథలో తన పాత్రకు చాలా ప్రాధాన్యం ఉందని, కురల్ పాత్ర చాలా డిఫరెంట్‌గా, ఆసక్తికరంగా ఉంటుందని ఆమె చెప్పారు. “కురల్ చాలా నిజాయితీ గల పాత్ర. తన భావోద్వేగాల పట్ల నిబద్ధతగా ఉంటుంది, చుట్టూ ఉన్న వారందరితో స్నేహంగా ఉంటుంది. చాలా సూటిగా మాట్లాడుతుంది. ఇప్పటివరకు ఇలాంటి పాత్ర చేయలేదు, అందుకే ఇది ఒక మంచి అనుభూతిని ఇచ్చింది” అని మమిత అన్నారు. ఈ సినిమాలో కొన్ని ఎమోషనల్ సీన్స్ తనకు సవాలుగా అనిపించాయని, వాటి కోసం రాత్రంతా డైలాగ్స్ ప్రాక్టీస్ చేసి, షూట్ సమయంలో ఆందోళన లేకుండా సీన్ మీద ఫోకస్ చేశానని ఆమె వెల్లడించారు. తాను ఎప్పుడూ షూట్‌కు ముందు బాగా ప్రిపేర్ అయి ఉండాలని చూసుకుంటానని, అందుకే ఈ పాత్ర ఒకేసారి సవాలుగా, ఉత్సాహంగా అనిపించిందని పేర్కొన్నారు.
ప్రదీప్ రంగనాథన్‌తో కెమిస్ట్రీ
హీరో ప్రదీప్ రంగనాథన్‌తో కలిసి పనిచేయడం గొప్ప అనుభవమని మమిత చెప్పారు. “ఆయనతో సెట్‌లో పని చేయడం చాలా ఫన్‌గా, సౌకర్యంగా ఉంటుంది. ఏ సీన్ అయినా సహజంగా, సంతోషంగా మార్చేస్తారు. ఎంత సక్సెస్ వచ్చినా ఆయన చాలా సింపుల్‌గా ఉంటారు. ఆయనతో నటించడం చాలా ఈజీగా అనిపించింది. ప్రేక్షకులతో ఆయనకు ఉండే కనెక్షన్ స్క్రీన్‌పై మాత్రమే కాదు, రియల్ లైఫ్‌లో కూడా అంతే లవబుల్‌గా ఉంటుంది. మా పాత్రల కెమిస్ట్రీ ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది” అని ఆమె తెలిపారు.
సీనియర్ నటుడు శరత్ కుమార్ లాంటి వారితో కలిసి పని చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని మమితా బైజు అన్నారు. దర్శకుడు కీర్తిశ్వరన్ గురించి మాట్లాడుతూ, “ఆయన చాలా క్లియర్ విజన్ తో ఉంటారు. ఆయన గైడెన్స్ వల్లే నేను నా పాత్రకు లోతుగా కనెక్ట్ అయ్యి, సహజంగా నటించగలిగాను” అని ఆమె ప్రశంసించారు.
పాజిటివ్ వైబ్స్‌తో ‘డ్యూడ్’
సినిమా సాంకేతిక అంశాల గురించి మాట్లాడుతూ, “సాయి అభ్యంకర్ మ్యూజిక్ ఈ సినిమాకి బిగ్ ఎసెట్. పాటలు మనసుని ఆకట్టుకుంటాయి. నేపధ్య సంగీతం కూడా అద్భుతంగా ఉంటుంది” అని తెలిపారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ గురించి చెబుతూ, “ఆయన విజువల్స్ సినిమాకి జీవం పోస్తాయి. ప్రతి ఫ్రేమ్‌ని పర్ఫెక్ట్‌గా తీర్చిదిద్దేందుకు ఆయన ఎంతో కష్టపడ్డారు” అని కొనియాడారు. మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి పనిచేయడం గొప్ప అనుభవమని, వారు చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ అని, సినిమాని చాలా గ్రాండ్‌గా నిర్మించారని ఆమె చెప్పారు.
‘డ్యూడ్’ అన్ని వయసుల ప్రేక్షకులకు, ముఖ్యంగా కుటుంబాలకు, యువతకు నచ్చే సినిమా అవుతుందని మమితా బైజు గట్టిగా విశ్వాసం వ్యక్తం చేశారు. “ఇది ఫన్‌గా, లైట్‌హార్ట్‌డ్‌గా ఉన్నా, లోపల ఒక మీనింగ్ ఫుల్ కోర్ ఉంది. ఇది పండుగకి పర్ఫెక్ట్‌గా సరిపోయే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. నా అభిమానులు, తెలుగు, తమిళ ప్రేక్షకులందరూ ఈ సినిమాకి ప్రేమ చూపాలని కోరుకుంటున్నాను. ఈ దీపావళికి కుటుంబం, స్నేహితులతో కలిసి థియేటర్‌కి వెళ్లి ‘డ్యూడ్’ను చూసి, ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటారని కోరుకుంటున్నాను” అని మమితా బైజు తమ మాటలను ముగించారు.
