Varanasi Movie: ‘వారణాసి’ అంతకుమించి.. టాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డులు!

Varanasi Movie Telugu Rights

Varanasi Movie Telugu Rights

Varanasi Movie Telugu Rights: ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘వారణాసి’. సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు, దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన థియేట్రికల్‌, నాన్‌-థియేట్రికల్‌ బిజినెస్‌పై సోషల్‌ మీడియాలో అనేక వార్తలు వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా వారణాసి తెలుగు రైట్స్‌ రూ.350 కోట్లకు ఫైనల్‌ అయ్యాయని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తల్లో వాస్తవం లేదని తెలుస్తోంది.

ఇప్పటివరకు వారణాసి తెలుగు హక్కులు రూ.350 కోట్లకు ఫైనల్‌ అయినట్లు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. అయినప్పటికీ జక్కన్న సినిమాలపై ఉన్న క్రేజ్‌, మహేష్‌ బాబు స్టార్‌డమ్‌ నేపథ్యంలో తెలుగు హక్కులకు భారీ డిమాండ్‌ ఉన్నట్లు ట్రేడ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా తెలుగు రైట్స్‌ కోసం ప్రముఖ నిర్మాత దిల్‌ రాజుతో పాటు మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ రేసులో ఉన్నట్లు సమాచారం. వారణాసిపై ఉన్న భారీ అంచనాలను పరిగణనలోకి తీసుకుంటే.. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కుల విలువ ప్రస్తుతం ప్రచారంలో ఉన్న రూ.350 కోట్ల కంటే కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

వారణాసి కేవలం మహేష్‌ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా మాత్రమే కాదు. భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో మరో మెట్టు పైకి తీసుకెళ్లేలా అత్యంత భారీ స్కేల్‌లో ఈ చిత్రాన్ని మేకర్స్ రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం దాదాపు రూ.1,400 కోట్ల బడ్జెట్‌ ఖర్చవుతుందని అంచనా. అదే నిజమైతే భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రాల్లో వారణాసి ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. భారీ బడ్జెట్‌, మహేష్‌–రాజమౌళి కాంబినేషన్‌, అంతర్జాతీయ స్థాయి కథా నేపథ్యం వంటి అంశాలతో వారణాసిపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా విడుదలకు ముందే బిజినెస్‌ పరంగా సరికొత్త రికార్డులు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారణాసి 2027 ఏప్రిల్‌ 7న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.